ఆ సీసా నాశనం కావడానికి 450 ఏళ్లు పడుతుందట !
1 min read
పల్లెవెలుగువెబ్ : సాధారణంగా మంచినీళ్ల సీసాను ఉపయోగిస్తుంటాం. కానీ ఒకసారి వాడి బయట పారేసే ఆ ప్లాస్టిక్ నీళ్ల సీసా నామరూపాలు లేకుండా మట్టిలో కలిసి పోవడానికి ఏకంగా 450 సంవత్సరాల సమయం పడుతుందట. అలానే.. మనం వాడిపారేసిన టూత్‌బ్రష్ మట్టిలో కలవాలంటే 500 సంవత్సరాలు కావాలంట. పెళ్లిళ్లు, ఇతర పార్టీల సమయంలో ఉపయోగించే ప్లాస్టిక్ గ్లాసులు భూమిలో కలిసిపోవడానికి 450 ఏళ్లు పడుతుంది. చివరకు అందరి చేతుల్లో కనిపించే ప్లాస్టిక్ కవర్ మట్టిలో కలవాలంటే 20 ఏళ్లదాక సమయం పడుతుంది. పర్యావరణానికి విపరీతమైన హానికలిగించే ఒకసారి ఉపయోగించిన తర్వాత పారేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ వస్తువుల వినియోగంపై ఈ ఏడాది జూలై 1 నుంచి నిషేధం విధించిన కేంద్రం.. ప్రజలందరూ నిత్యం ఉపయోగించే రకరకాల ప్లాస్టిక్ వస్తువుల ద్వారా కలిగే అనర్ధాల గురించి విస్తృత ప్రచారం మొదలుపెట్టింది.