జగనన్న కాలనీ గృహ నిర్మాణాలను వేగవంతంగా పూర్తిచేయాలి..
1 min read– కొమడవోలు జగనన్న కాలనీ లేఅవుట్ ను
– జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ తో కలిసిపరిశీలించిన
– జిల్లా ప్రత్యేకాధికారి శశిభూషణ్ కుమార్..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : గృహ నిర్మాణాలకు ప్రస్తుత వాతావరణం అనువుగా ఉన్న నేపథ్యంలో హౌసింగ్ నిర్మాణాలను వేగవంతం చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి మరియు ఏలూరు జిల్లా ప్రత్యేకాధికారి శశిభూషణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఏలూరు అర్బన్ పరిధిలో కొమడవోలులో జగనన్న కాలనీ లేఅవుట్ ను జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ తో కలిసి పరిశీలించారు. ఈ పరిశీలనలో భాగంగా కాలనీలో జరుగుతున్న గృహనిర్మాణాల పురోగతిని త్రాగునీరు, విద్యుత్, రహదారులు వంటి సౌకర్యాలు ఏర్పాటును పరిశీలించారు. ప్రాజెక్ట్ విలువ, ఇప్పటి వరకు ఎంత శాతం పనులు పూర్తయ్యాయని హౌసింగ్ పిడిని వివరణ కోరారు. ప్రతి గృహాన్ని నిర్ణీత లక్ష్యపు గడువులోపు నిర్మాణాలు పూర్తిచేయడానికి ఎక్కువ కూలీలను పెట్టి కాలనీ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కాలనీ కాంట్రాక్టర్ ను ప్రత్యేకాధికారి ఆదేశించారు. ఇళ్లపట్టా పొందిన ప్రతిఒక్కరూ నిర్మాణం చేపట్టి పూర్తిచేయడంతోపాటు మౌలిక సదుపాయాల కల్పనపై ఆయా శాఖల అధికారులు సమన్వయంతో కృషిచేయాలని తెలిపారు. ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ప్రత్యేకాధికారి శిశిభూషణ్ కుమార్ తో మాట్లాడుతూ ఏలూరులో మూడు పెద్ద జగనన్న లేఅవుట్లలో కొమడవోలు లేఅవుట్ ఒకటని 7 వేల మంది కుటుంబాలకు ఈ లేఅవుట్ లో పట్టాలు ఇవ్వడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఈ లేఅవుట్ స్ధలంలో విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటుకు భూమిని గుర్తించడం జరిగిందని త్వరలో సబ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. త్రాగునీరు నిమిత్తం మున్సిపాలిటీ నుండి అమృత్-2 పథకం కింద ఏర్పాట్లకు ప్రణాళికను ప్రతిపాధించినట్లు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ప్రత్యేకాధికారి శశిభూషణ్ కుమార్ కు వివరించడం జరిగింది. ఈ పరిశీలనలో హౌసింగ్ పిడి(ఎఫ్ఎసి) ఇ. నరసింహారావు , ఆర్ డిఓ కె. పెంచల కిషోర్, ఏలూరు మున్సిపల్ కార్పోరేషన్ కమీషనరు ఎస్. వెంకటకృష్ణ, ఏలూరు తహశీల్దారు సోమశేఖర్, తదితరులు పాల్గొన్నారు.