జగనన్నే మా భవిష్యత్’ కార్యక్రమం
1 min read– ప్రతి ఇంటిని సందర్శించి అభిప్రాయాలను సేకరిస్తాం..
– హోంమంత్రి తానేటి వనిత
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : గత ప్రభుత్వంలో జరిగిన మేలేంటి? ఈ ప్రభుత్వంలో జరిగిన మేలేంటి? తెలియజేయండి.కొవ్వూరు నియోజవర్గంలో ఏప్రిల్ 14న ముఖ్యమంత్రి గారి పర్యటన వివరాలను వెల్లడించిన హోంమంత్రి తానేటి వనిత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి రోజైన ఈనెల 14న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన కొవ్వూరు నియోజకవర్గంలో ఉంటుందని రాష్ట్ర హోం మంత్రి, ప్రకృతి విపత్తుల నివారణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత ప్రకటించారు. కొవ్వూరు మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. కొవ్వూరు నియోజకవర్గంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని హోంమంత్రి కోరారు. ఈ సందర్భంగా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ… ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పరిపాలన చూసి ప్రజల్లో జగనన్నే మా నమ్మకం అని రాష్ట్ర భవిష్యత్ అనే ఉద్దేశ్యంతో‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం ప్రారంభమైందన్నారు. ఈ కార్యక్రమంలో ‘మా నమ్మకం నువ్వే జగన్’ అనే ట్యాగ్ లైన్ ప్రజల నుంచి వచ్చిన నినాదమని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల మంది పార్టీ సైనికులు 14 రోజుల్లో (ఏప్రిల్ 7 నుంచి 20 వరకు) 1.60 కోట్ల కుటుంబాలను నేరుగా కలుసుకుని అభిప్రాయాలను సేకరిస్తారని తెలిపారు. ప్రతీ ఇంటి గడపకు ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సైనికులుగా వైసీపీ పదాతిదళంగా, గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు కలిసి క్షేత్రస్థాయిలో పనిచేస్తారని తెలిపారు. గృహసారథులు ఇంటింటికీ వెళ్తారని, వారిని సచివాలయ కన్వీనర్లు కోఆర్డినేట్ చేస్తారని ఆమె తెలిపారు. ప్రస్తుతం జరిగే ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో సంక్షేమ పథకాలు అందుతున్నాయా..? లేదా..? అని ఎమ్మెల్యేలు ఎలాగైతే అడుగుతున్నారో.. అదేవిధంగా ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో కూడా గత ప్రభుత్వంలో జరిగిన మేలేంటి..? ఈ ప్రభుత్వంలో జరిగిన మేలేంటి.? మీకు ఏఏ పథకాలు అందుతున్నాయి..? గతంలో ఇలా ఉందా..? మా ప్రభుత్వంపై మీ అభిప్రాయమేంటి.అనే ప్రశ్నలతో వారి సంతృప్తస్థాయిని తెలుసుకుంటారని అన్నారు. అనంతరం కొవ్వూరు పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమంలో ప్రజల నుంచి అభిప్రాయాలను మంత్రి తానేటి వనిత తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.