వైద్యవిద్యను అంగడిలో సరుకుగా మార్చిన జగన్ సర్కార్
1 min read– PDSU జిల్లా అధ్యక్షులుS.M.D.రఫీ డిమాండ్
పల్లెవెలుగు వెబ్ నంద్యాల : పేద, బడుగు విద్యార్థులను వైద్యవిద్యకు దూరం చేసే 107,108 జీవోలను వెంటనే రద్దు చేయాలి. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం వైద్యవిద్యను అంగడిలో సరుకుగా మార్చి, వ్యాపారమయం చేయడానికి తీసుకువచ్చిన 107,108 జీవోలను తక్షణమే రద్దు చేయాలని బుధవారం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSU నంద్యాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పద్మావతి సర్కిల్ వద్ద నిరసన ధర్నా చేయడం జరిగింది.ఈ సందర్బంగా PDSU జిల్లా అధ్యక్షులు S.M.D.రఫీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2023-24 విద్యా సంవత్సరం నుండి నంద్యాల,విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నంలో ఐదు మెడికల్ కాలేజీలను ప్రారంభించిందని అన్నారు. అయితే ఈ మెడికల్ కాలేజీల్లో సీట్లను A కేటగిరి కన్వీనర్ కోటా-50శాతం , B కేటగిరి సెల్ఫ్ ఫైనాన్సింగ్ -35 శాతం, C కేటగిరి NRI కోటా 15 శాతం మూడు కేటగిరిలుగా వర్గీకరించి ఫీజులను వరుసగా 15వేలు, 12 లక్షలు, 20 లక్షలు రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయిస్తూ 107,108 జీవోలను జారీ చేసిందని అన్నారు. ప్రభుత్వ వైద్య కాలేజీల్లో ఇప్పటి వరకూ 100 శాతం సీట్లను కన్వీనర్ కోటా క్రిందనే భర్తీ చేసే వారని, నేడు బి, సి కేటగిరీలుగా మార్చి వైద్య విద్యను SC, ST, BC, మైనార్టీ విద్యార్థులకు దూరం చేస్తుందని అన్నారు. అంతేకాకుండా మెరిట్ విద్యార్థులకు నష్టం జరుగుతుందని అన్నారు. వైద్య కళాశాలల స్థాపనకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు ఇస్తుందని, జాతీయ వైద్య మండలి అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం బి, సి కేటగిరిలుగా చేసి ఫీజులు ఎలా నిర్ణయిస్తుందని ప్రశ్నించారు. పేద బడుగు విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేసే 107,108 జీవోలను తక్షణమే రద్దు చేయాలని, అలాగే పీజీ మెడికల్ మరియు డెంటల్ కాలేజీల్లో పెంచిన 15 శాతం ఫీజులను తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే విద్యార్థి, యువజన సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జగన్ ప్రభుత్వం కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తామని చెప్పి పాఠశాల విద్యను ధ్వంసం చేసిందని, పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యకు ఫీజు రియంబర్స్ మెంట్ ను 77 జీవో తెచ్చి గత మూడు సంవత్సరాల నుండి వేలాది మంది పేద విద్యార్థులు పీజీ విద్యకు దూరం చేసిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలను త్రిప్పి కొట్టాలని విద్యార్థులకు వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో PDSU జిల్లా నాయకులు బాలాజీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు షాహిద్, వినోద్ ,PDSU పట్టణ నాయకులు నరసింహ,వినోయ్,స్వామికుమార్,రాజు, రామన్న, జయ, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ,రవి,హరి దితరులు పాల్గొన్నారు.