NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యునెస్కో గుర్తింపు సాధనలో జై మక్తల్ ట్రస్ట్ అవిశ్రాంత పోరాటం..

1 min read

“ఈ విజయాన్ని జరుపుకుందాం, కానీ లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించవద్దు” – ఛైర్మన్ సందీప్ కుమార్ మక్తల

యునెస్కో నామినేషన్ , గ్లోబల్ అవుట్రీచ్ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు

తెలంగాణ,న్యూస్ నేడు: ముడుమాల్  నిలువు రాళ్లు (మెన్హిర్స్) (3500 సంవత్సరాల పురాతన మేగాలిథిక్ స్మారక చిహ్నాలు)ను యునెస్కో ప్రాథమిక ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చించడంలో జై మక్తల్ ట్రస్ట్ కీలక పాత్ర పోషించింది. ట్రస్ట్ అధ్యక్షుడు శ్రీ సందీప్ కుమార్ మక్తల ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రతిష్టాత్మక విజయంతో తెలంగాణ రాష్ట్రం మాత్రమే కాక, భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి గర్వకారణంగా నిలిచింది. ఈ పురాతన స్మారక చిహ్నాల పరిరక్షణ , ప్రచారంలో ట్రస్ట్ చేసిన అవిరామ కృషి అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యత పొందటానికి కారణమైంది. ఈ సందర్భంగా సందీప్ కుమార్ మక్తల మాట్లాడుతూ, “ఈ గొప్ప విజయాన్ని జరుపుకోవాల్సిన సమయం వచ్చిందని, అయితే తాము ఇంకా అప్రమత్తంగా ఉండి లక్ష్యసాధనపై మరింతగా దృష్టి పెట్టాలని అన్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వ స్థితి సాధించేందుకు ముందున్న మార్గం కఠినమైనదిగా ఉంటుందని, ఇది మరింత నిబద్ధత , సామూహిక ప్రయత్నాన్ని అవసరం చేస్తుంది” అని అన్నారు.రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు పొందిన సందర్భాన్ని ప్రేరణగా తీసుకున్న జై మక్తల్ ట్రస్ట్, ముడుమల్  నిలువు రాళ్లు (మెన్హిర్స్) పరిరక్షణ, ప్రచారానికి వ్యూహాత్మక చర్యలు చేపట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమర్థవంతంగా సమన్వయం చేస్తూ, అప్పటి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి, అప్పటి తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్‌లకు వివరణాత్మక నివేదికలు, మెమోరాండమ్‌లు సమర్పించారు. వారి మద్దతు ఈ కీలకమైన విజయానికి బలమైన పునాదిగా నిలిచింది.సందీప్ కుమార్ మక్తల, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ప్రస్తుత పర్యాటక శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు , స్థానిక ఎమ్మెల్యే శ్రీ వాకీటి శ్రీహరికి కృతజ్ఞతలు తెలియజేశారు. వారి సహకారం ఈ ఘన విజయానికి కారణమని తెలిపారు.ట్రస్ట్ ప్రభుత్వ ప్రాతినిధ్యం వరకే పరిమితం కాకుండా, అనేక సారి ముడుమల్ నిలువు రాళ్లు (మెన్హిర్స్) వద్ద పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు స్థానిక ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు అవగాహన కార్యక్రమాలు, సాంస్కృతిక ఈవెంట్‌లు నిర్వహించింది. ప్రపంచ వారసత్వ వారోత్సవాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాలు ఈ ప్రదేశానికి చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను చాటిచెప్పాయి.ట్రస్ట్ చేపట్టిన అత్యంత ప్రాముఖ్యతగల కార్యక్రమాల్లో “ఆర్బిట్ 2022” ముఖ్యమైనది. ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా మరియు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్‌తో కలిసి నిర్వహించిన ఈ ప్రాజెక్టులో సౌర వ్యవస్థ సంబంధిత పరిశీలనలు నిర్వహించి, మెన్హిర్స్ యొక్క ఖగోళ శాస్త్ర సంబంధిత ప్రాముఖ్యతను గుర్తించారు. ఈ పరిశోధన ఫలితాలు యునెస్కో గుర్తింపు కోసం సమర్పించిన నివేదికలో కీలకపాత్ర పోషించాయి.

అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత పొందిన ఈ ప్రాజెక్టులో దక్షిణ కొరియాలోని సెజాంగ్ విశ్వవిద్యాలయం ముడుమల్  నిలువు రాళ్లు (మెన్హిర్స్) ఖగోళ ప్రాముఖ్యతపై ప్రత్యేక పరిశోధనలు నిర్వహించింది. ఈ అంతర్జాతీయ భాగస్వామ్యం యునెస్కో గుర్తింపు కోసం సమర్పించిన ఆధారాలను మరింత బలపరిచింది.భవిష్యత్‌లో జై మక్తల్ ట్రస్ట్ యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనుంది. ముదుమల్ మెన్హిర్స్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చేలా మరింత ప్రచారం మరియు పరిరక్షణ చర్యలను కొనసాగించనుంది.యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు సాధించటం ద్వారా స్థానిక ప్రజలకు అనేక ప్రయోజనాలు కలుగనున్నాయి. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడంతో పాటు ఉద్యోగ అవకాశాలు, ఆర్థికాభివృద్ధి, వృద్ధి చెందిన మౌలిక సదుపాయాలు మరియు ప్రాంతీయ గర్వాన్ని పెంపొందించేందుకు ఇది సహాయపడుతుంది. ఈ గుర్తింపు భవిష్యత్ తరాలకు ముడుమాల్ మెన్హిర్స్‌ను పరిరక్షించడంలో కీలక పాత్ర పోషించనుంది.జై మక్తల్ ట్రస్ట్ తన లక్ష్యానికి కట్టుబడి, చరిత్రను పరిరక్షిస్తూ ప్రాంతీయ అభివృద్ధికి సహకరించే దిశగా తమ కృషిని కొనసాగించనుంది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *