టిడిపి, జనసేన ప్రభుత్వం ఏర్పాటుకోసం జనసైనికులు కష్టపడాలి
1 min readజనసేన ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని దిశానిర్దేశం చేసిన టి.జి భరత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జనసైనికులందరూ టిడిపి జనసేన ప్రభుత్వాన్ని తెచ్చుకునేందుకు కష్టపడి పనిచేయాలని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. శనివారం నగరంలోని అంబేద్కర్ భవన్‌లో జనసేన పార్టీ కర్నూలు నియోజకవర్గ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టి.జి భరత్ ముఖ్య అతిథిగా హాజరై జనసైనికులను ఉద్దేశించి మాట్లాడారు. జనసేన క్యాడర్ మొత్తం పవన్ కళ్యాణ్ మీద అభిమానం వల్ల భావోద్వేగంతో పనిచేస్తారన్నారు. ఏదైనా పని అనుకుంటే దాన్ని పూర్తి చేసేందుకు ఎంతవరకైనా పోరాడేందుకు జనసైనికులు సిద్ధంగా ఉంటారన్నారు. టిడిపి జనసేన ప్రభుత్వం వచ్చాక ప్రజలందరికీ మంచి పాలన అందుతుందని.. ముఖ్యంగా యువత భవిష్యత్తుకు మంచి మార్గం దొరుకుతుందన్నారు. టిడిపి హయాంలో అనంతపురం జిల్లాలో ఏర్పాటైన కియా పరిశ్రమ వల్ల ఆ ప్రాంతం రూపురేఖలు మొత్తం మారిపోయాయని తెలిపారు. అందుకే కర్నూల్లో తనను గెలిపిస్తే తనకున్న నెట్ వర్క్‌తో వివిధ కంపెనీలు కర్నూల్లో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత తాను తీసుకుంటానని, ఉపాధి లేని వారందరికీ పని కల్పించి ఆదాయం వచ్చేలా చేస్తానని భరత్ తెలిపారు. ఈ విషయాలన్నీ యువత గ్రహించి ప్రజలకు వివరించి అర్థమయ్యేలా చెప్పాలన్నారు. పవన్ కళ్యాణ్ లాగే తాము కూడా ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లో ఉన్నామన్నారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే వేస్తే ఐదేళ్లు తాను కష్టపడి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటనన్నారు. అనంతరం జనసేన అసెంబ్లీ ఇంచార్జి అర్షద్ మాట్లాడుతూ ప్రజాసేవకు పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారన్నారు. టిడిపి జనసేన ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. కర్నూల్లో టి.జి భరత్ గెలుపు కోసం అందరం సమిష్టిగా కష్టపడదామని పిలుపునిచ్చారు. అనంతరం యువతకు కండువాలు కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్య క్రమంలో టిడిపి కర్నూలు నియోజకవర్గ పరిశీలకులు శ్రీనివాసమూర్తి, నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, జనసేన ఐ.టి విభాగం నేతలు లక్ష్మీకాంత రెడ్డి, అనిత, నాగరాజు, టిడిపి వీరశైవ లింగాయత్ సాధికార సమితి నేత శివరాజ్, టిడిపి, జనసేన నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.