రాయచోటిలో అభివృద్ధి పనులపై జేసీ పర్యటన
1 min readపల్లెవెలుగు వెబ్, రాయచోటి: పట్టణంలో పలు అభివృద్ధి పనులపై జాయింట్ కలెక్టర్ గౌతమి గురువారం శరవేగంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె పట్టణ పరిధిలోని చిత్తూరు రోడ్డు మార్గంలో తిరుపతి నాయుడు కాలనీ, ఎస్టి కాలనీ ల మధ్య నూతనంగా నిర్మించనున్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. నివాసాల మధ్య ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎలా నిర్మిస్తారంటూ స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె ఆ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆనుకొని ఉన్న స్థలంలో టి.టి.డి కళ్యాణ మండపం నిర్మించే ప్రాంతాన్ని కూడా పరిశీలించారు.
అలాగే ఆర్టీసీ బస్టాండ్ విస్తరణ కోసం స్థలాన్ని పరిశీలించి పరిస్థితిపై ఆరా తీశారు. అలాగే ఖరీఫ్ సీజన్ కు మంజూరైన వేరుశనగ విత్తన కాయలు రైతులకు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు లేదా మూడు రోజుల్లో రైతులకు విత్తనకాయలు అందకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అనంతరం దక్షిణ కాశీగా పేరుగాంచిన వీరభద్ర స్వామి ఆలయం పడమర వైపున గాలిగోపురం నిర్మించేందుకు తొలగించే ఆక్రమణల విషయమై పరిశీలించారు.ఈమె వెంట సబ్ కలెక్టర్ పృద్వి తేజ్,సి సి రమేష్, తహసిల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి, ఆర్టీసీ డిఎం నారాయణస్వామి,డిప్యూటీ తహసిల్దార్ నరసింహ కుమార్ తదితరులు పాల్గొన్నారు.