జోలపట్టి.. విరాళాలు సేకరించి..
1 min read– క్యాన్సర్ రోగికి ఆర్థిక సహాయం చేసిన నేటి మధర్‌థెరిస్సా..
పల్లెవెలుగు వెబ్, చాగలమర్రి: సేవ చేయాలన్న ఆలోచన ఉండాలే కానీ… ఏరూపంలోనైనా… సహాయం చేయవచ్చని నిరూపించింది.. నేటి మధర్ థెరిస్సా.. 17వ వార్డు అంగన్వాడీ కార్యకర్త చంద్రకళ. కరోనా విపత్కర సమయంలో ఎంతో మందికి ఆహారం, మాస్క్‌లు, నీరు సరఫరా చేసి.. సేవలు అందించిన ఆమె… కాళ్లకు చెప్పులు లేకపోయిన కొందరి అభాగ్యులకు.. తన సొంత డబ్బుతో కొనిచ్చి… సేవాతత్పురురాలిగా నిలిచింది. మండల కేంద్రమైన చాగలమర్రి ఎస్సీ కాలనీలో ఓ వ్యక్తి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండగా.. వైద్యఖర్చుల నిమిత్తం…వీధుల్లో జోలపట్టి… విరాళాలు సేకరించింది.. 17వ వార్డు అంగన్వాడీ కార్యకర్త చంద్రకళ..ఎందరికో ఆదర్శంగా నిలిచింది.
జోలపట్టి.. విరాళాలు సేకరించి…
చాగలమర్రి యస్సీ కాలనీకి చెందిన తలారి జేమ్స్ క్యాన్సర్ వ్యాధితో గత కొన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నాడు. భార్య, ముగ్గురు పిల్లలున్న తలారి జేమ్స్‌కు కనీసం వైద్యం చేయించుకోడానికి కూడా డబ్బులు లేవు. విషయం తెలుసుకున్న అంగన్వాడీ కార్యకర్త చంద్రకళ దాతలతో విరాళాలు సేకరించడంతోపాటు.. పలు వీధుల్లో జోలపట్టి.. నిధులు సమీకరించింది. మొత్తం రూ. 7 వేలు నగదు రాగా బాధితుడు జేమ్స్ కుటుంబానికి అందజేసింది. అంతేకాక ఆమె పలు స్వచ్ఛంద సంస్థలు, దాతలను సంప్రదించగా… శుక్రవారం రాయలసీమ హెల్పింగ్ హాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, విద్యార్థి సంఘ నాయకుడు షేక్ యాసీన్ రూ.14వేలు నగదు, బియ్యం, తదితర వంట సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాసిర్, ఖలీల్, దస్తగిరి, కిరణ్, గౌస్, మౌలాలి తదితరులు పాల్గొన్నారు.
ఆమె సేవలకు.. మెచ్చి..
ఉద్యోగం… చిన్నదే.. అయినా.. సేవ చేయడంలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది అంగన్వాడీ కార్యకర్త చంద్రకళ. కేవలం ఆమె మానవతా దృక్పథం.. సేవా గుణం… మెచ్చి.. అభినందించిన దాతలు, స్వచ్ఛంద సంస్థలు… తలారి జేమ్స్‌కు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొస్తున్నాయి. ఇప్పటికే పలు స్వచ్ఛంద సంస్థలను సంప్రదించానని పేర్కొన్న చంద్రకళ.. శనివారం పలువురు సహాయం చేయడానికి ముందుకు వస్తారని.. మరికొంత మంది దాతలు ముందుకు రావాలని కోరారు. విద్యార్థి సంఘ నాయకుడు రాయలసీమ హెల్పింగ్ హ్యాండ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ యాసిన్‌కు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
వైద్యం.. బసవ తారకం క్యాన్సర్ ఆస్ప్రతికి…
హైదరాబాదులోని బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి నందు వైద్యం చేస్తే కొంత మెరుగవుతుందని భావించిన అంగన్వాడీ కార్యకర్త చంద్రకళ.. ఆదివారం బాధితుడు తలారి జేమ్స్‌ను ఆస్పత్రికి తరలించనున్నారు.