సమాజం కోసం జీవించే అరుదైన వృత్తి జర్నలిజం
1 min read– సంక్రాంతి సందర్భంగా జర్నలిస్టులకు నిత్యావసర సరుకుల కిట్లను అందజేసిన సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా, కుటుంబాలను సైతం వదిలీ సమాజం కోసం పనిచేసే జర్నలిస్టులు అందరికీ ఆదర్శప్రాయమని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. కర్నూలు నగరంలోని జిల్లా పౌరసం సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం ఆవరణలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ జర్నలిస్టులకు నిత్యావసర వస్తువుల కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారానికి జర్నలిస్టులు నిరంతరం పాటుపడుతున్నారని కొనియాడారు. విధి నిర్వహణలో సమయపాలన లేకుండా ఆరోగ్యాలను సైతం లెక్కచేయకుండా కొన్ని సందర్భాలలో కుటుంబాలకు దూరంగా నిబద్ధతతో వృత్తి ధర్మాన్ని జర్నలిస్టులు నిర్వహిస్తున్నారని చెప్పారు .ఈ సంక్రాంతి వేడుకలను జర్నలిస్టులు తమ కుటుంబాలతో సంతోషంగా కలిపి జరుపుకోవాలని ఆకాంక్షించారు. విధి నిర్వహణలో భాగంగా జర్నలిస్టులు చాలావరకు కుటుంబాలకు దూరంగా ఉంటారని ఆ బాధ జర్నలిస్టుల కుటుంబాలలో వ్యక్తం అవుతుందని చెప్పారు .సంక్రాంతి పర్వదినం సందర్భంగా విధి నిర్వహణ చేస్తూనే జర్నలిస్టులు కుటుంబం కోసం సమయం కేటాయించి సంతోషకరంగా ఉండాలని చెప్పారు. ప్రస్తుతమున్న ఈ డిజిటల్ యుగంలో సెల్ఫోన్లకు ప్రాధాన్యత పెరిగి మానవ సంబంధాలు దూరమవుతున్నాయని చెప్పారు. ఒకే చోట పదిమంది ఉన్నప్పటికీ ఎవరికి వారు సెల్ఫోన్లో చూడటంతోనే సరిపోతుందని ఒకరితో ఒకరు మాట్లాడుకునే సంస్కృతి దూరం అవుతున్న బాధను వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మానవ సంబంధాలను తిరిగి పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడే పరస్పరం ఒకరి సమస్యలను ఒకరు పరిష్కరించుకునే అవకాశం ఉంటుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. పెరిగిన ఆధునిక టెక్నాలజీని అవసరం ఉన్నంతవరకే వినియోగించాలని అనవసరమైన విషయాలకు దూరంగా ఉండాలని సూచించారు .జర్నలిస్టుల సేవలను గుర్తించుకొని సంక్రాంతి పర్వదిన సందర్భంగా తాను వారికి నిత్యవసర వస్తువుల కిట్లను అందించడం సంతోషకరంగా భావిస్తున్నారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు మనోహర్, శ్రీనివాసులు, రామస్వామి, చెన్నయ్య, మల్లికార్జునజ్ ఆంజనేయులు, రామకృష్ణ ,ర మేష్ తదితరులు పాల్గొన్నారు.