జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు క్షేత్రస్థాయిలో భూములు పరిశీలించి నివేదికివ్వండి
1 min readకలెక్టర్ ఎస్.డిల్లీరావు
పల్లెవెలుగు వెబ్ విజయవాడ: జిల్లాలో ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న జర్నలిస్టులకు స్థలాల కేటాయింపునకు అనువైన భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు.. రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారులను ఆదేశించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు సంబంధించి భూ సేకరణకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు గురువారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు నగరంలోని ఆయన క్యాంపు కార్యాలయం నుంచి రెవెన్యూ, సమాచార శాఖ అధికారులతో గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పాత్రికేయులకు మూడు సెంట్ల ఇంటి స్థలం మంజూరుకు ఉత్తర్వులు జారీచేయడం జరిగిందన్నారు. పాత్రికేయులు ఆన్‌లైన్ ద్వారా ఇప్పటికే దరఖాస్తులు చేసుకోవడం జరిగిందని.. ఎన్‌టీఆర్ జిల్లాకు సంబంధించి 1,277 మంది పాత్రికేయుల నుంచి సమాచార, పౌర సంబంధాల అధికారులు దరఖాస్తులు స్వీకరించి వాటిని పరిశీలించిన అనంతరం భూమిని కేటాయించేందుకు రెవెన్యూ శాఖకు జాబితాను సమర్పించడం జరిగిందన్నారు. ఇళ్ల స్థలాలకు సంబంధించి ఏర్పాటైన కమిటీ సభ్యులు, రెవెన్యూ, సమాచార శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి.. భూ సేకరణకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించామన్నారు. మండలాల వారీగా రెండో దశ పరిశీలన పూర్తిచేసి, తిరిగి జాబితాను సమర్పించాలని తహసీల్దార్లను, ఆర్‌డీవోలను ఆదేశించడం జరిగిందన్నారు. విజయవాడ నగర సమీపంలో రూరల్ మండలంలోని కొత్తూరు-తాడేపల్లితో పాటు ఇబ్రహీంపట్నం, కంచికచర్ల మండలాల పరిధిలో జర్నలిస్టులకు స్థలాలు కేటాయించేందుకు అనువైన భూములను గుర్తించేందుకు సంబంధిత అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో పర్యటించి, నివేదికలను సమర్పించాలన్నారు. టెలికాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్, డీఆర్‌వో వి.శ్రీనివాసరావు, ఆర్‌డీవో బీహెచ్ భవానీ శంకర్, డీఐపీఆర్‌వో యు.సురేంద్రనాథ్, డీపీఆర్‌వో ఎస్‌వీ మోహన్‌రావు, డివిజనల్ పీఆర్‌వో కె.రవి, పీఆర్‌వో వీవీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.