జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా గుర్తించాలి
1 min read– ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సి.హెచ్. కృష్ణాంజనేయులు
పల్లెవెలుగు వెబ్, విజయవాడ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా.. జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా గుర్తించాలని ఆంధ్ర ప్రదేశ్ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు సి.హెచ్. కృష్ణాంజనేయులు, రాష్ట్ర జనరల్ సెక్రటరి ఎం. వంశీకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనాతో అశువులు బాసిన వర్కింగ్ మీడియా ప్రతినిధులను అక్రిడిటేషన్‌తో సంబంధం లేకుండా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియాను వారి కుటుంబ సభ్యులకు తక్షణమే అందచేయాలని, 2021మీడియా అక్రిడిటేషన్ తక్షణమే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కరోన కష్టకాలంలో నవరత్నాలు ప్రజలకు అందిస్తూ.. సేవ చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి… దేశంలోని పలు రాష్ట్రాల సీఎంలకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. అదేవిధంగా జర్నలిస్టుల సమస్యలను కూడా పట్టించుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటం వద్ద విన్నవించారు.
సమస్యలే… డిమాండ్ల రూపంలో..
- జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగానే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి, రూ. 50లక్షల భీమా సౌకర్యం కల్పించాలి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియాను కరోనా వలన మృతి చెందిన సర్కింగ్ మీడియా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ తో సంబంధం లేకుండా బాధిత కుటుంబాలకు తక్షణమే అందించి ఆదుకోవాలి.
- కోవిడ్–19 బారిన పడి హాస్పిటల్స్, హోం ఐసోలేషన్స్లో ఉంటున్న పాత్రికేయులకు రూ. లక్ష తక్షణ సహాయం అందించాలి
- తక్షణ ప్రాధాన్యత క్రమంలో జర్నలిస్టులకు కరోనా వ్యాక్సిన్ వేయించాలి.
- 2020-21 మీడియా అక్రిడిటేషను తక్షణం మంజూరు చేయాలి.
- మార్చి 2021తో ముగిసిన జర్నలిస్టులు హెల్త్ కార్డులు ఏ విధమైన చెల్లింపులు లేకుండా డిసెంబర్ 2021 వరకు పొడిగించాలి.