శ్రీశైల క్షేత్రంలో నేడు జ్వాలాతోరణం
1 min readపల్లెవెలుగు, వెబ్ శ్రీశైలం: కార్తిక పౌర్ణమి ఘడియలు వస్తున్న కారణంగా సాయంత్రం 6.00 గంటల నుంచి గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణోత్సవం జరిపించబడుతుంది. గంగాధరమండపం వద్ద జ్వాలాతోరణోత్సవానికి ఆయా ఏర్పాట్లు చేయబడుతున్నాయి. ముఖ్యంగా ఈ ఉత్సవానికి గాను గంగాధరమండపం వద్ద స్తంభాలను ఏర్పాటు చేసి, ఆ స్తంభాలను కలుపుతూ అడ్డంగా మరో స్తంభం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్తంభంపై వేలాడే విధంగా నేతితో తడిపిన నూలు వత్తులను ఏర్పాటు చేయబడుతాయి. ఈ వత్తులపై తిరిగి నెయ్యిని పోసి జ్వాలా తోరణాన్ని వెలిగించడం జరుగుతుంది.పురాణపరంగా త్రిపురాసురులను సంహరించిన తరువాత పరమేశుని దృష్టిదోషపరిహారం కోసం, ఇంకా విజయుడైన అతని గౌరవార్థం పార్వతీదేవి మొదటగా ఈ జ్వాలా తోరణోత్సవాన్ని జరిపించిందనీ,అప్పటి నుండి ఇది ఆచారమైందని చెప్పబడుతోంది.అందుకే ఆలయంలో ఈ జ్వాలా తోరణోత్సవాన్ని జరపడం సంప్రదాయమైంది. కాగా తోరణంలో కాలిన నూలువత్తుల నుండి వచ్చిన భస్మాన్ని భక్తులు నుదుట ధరించడం ఎంతోవిశేషంగా భావిస్తారు.ఈ విధంగా ధరించడం వలన ఆరోగ్యం, ఆయుష్షు, ఐశ్వర్యం లభిస్తుందని విశ్వాసం.