కర్నూలులో..కదంతొక్కిన ‘యువగళం’
1 min readనారా లోకేష్‌కు అడుగడుగునా నీరాజనం..
- పూల వర్షంతో..అపూర్వ స్వాగతం..
- లోకేష్‌తో సమస్యలు..బాధలు చెప్పుకున్న కర్నూలువాసులు
- పల్లెవెలుగు: యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర కర్నూలు నగరంలో దుమ్మురేపింది. కర్నూలు శివారులోని రేడియో స్టేషన్ విడిది కేంద్రం నుంచి ప్రారంభమైన పాదయాత్రకు అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. యువనేతపై కర్నూలు ప్రజలు పూలవర్షం కురిపిస్తూ స్వాగతించారు. యువకులు బాణాసంచా కాలుస్తూ కేరింతలు కొడుతూ నినాదాలతో హోరెత్తించారు. తొలుత కర్నూలు బళ్లారి సర్కిల్ లో యువనేతకు అపూర్వ స్వాగతం లభించింది. నిలువెత్తు గజమాలతో అక్కడి ప్రజలు యువనేతను స్వాగతించారు. దారిపొడవునా అందరి ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమ్యలను అడిగి తెలుసుకున్నారు. యువనేత పాదయాత్ర చేసే రహదార్లపైకి జనం భారీగా చేరుకున్నారు. లోకేష్ ని చూసేందుకు భారీగా రోడ్ల పైకి వచ్చిన యువత, మహిళలు, వృద్దులు పెద్దఎత్తున తరలివచ్చారు. రోడ్లవెంట భవనాలపైనుంచి చేతులు ఊపుతూ యువనేతకు అభివాదం తెలిపారు. నాలుగేళ్లు మా దిక్కు చూడని ఎమ్మెల్యే మీరు వస్తున్నారు అని తెలిసి నిన్న సాయంత్రం హడావిడి గా వచ్చి పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి వెళ్ళిపోయారని కొందరు స్థానికులు లోకేష్ కు తెలిపారు. వార్డుల్లో తాగునీటి సమస్య, డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని లోకేష్ వద్ద పలు కాలనీల వాసులు ఆవేదన వ్యక్తంచేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలు టౌన్ వార్డుల్లో ఉన్న సమస్యల పరిష్కారం చేసి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. పాదయాత్రలో కర్నూలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీజీ భరత్, కార్యకర్తలు, నాయకులు ఉన్నారు.