చెన్నూరు రామాలయంలో కలశ పూజ
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు: అయోధ్యలో బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట పురస్కరించుకొని మండల కేంద్రమైన చెన్నూరు ప్రధాన రామాలయంలో సోమవారం ఉదయం ప్రత్యేక అభిషేక పూజలు హోమాలు నిర్వహించారు. చెన్నూరు మండలంలోని వివిధ గ్రామాల్లో రామాలయాలు ఆలయాల్లో తెల్లవారుజాము నుండి స్వామివారికి సుప్రభాత సేవ, ప్రజలచే వేద పారాయణం, సామూహిక అభిషేకాలు, సహస్రనామ పూజలు, శ్రీరామ నామ సంకీర్తన తో పాటు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ వూవెత్తున ఎగసిన నినాదాలతో అత్యంత వైభవంగా స్వామివారికి పూజలు వహించడం జరిగింది, అనంతరం ఊరేగింపుగా కలశాలను ప్రధాన రామాలయం వరకు తీసుకువచ్చారు. ఉత్సవ విగ్రహాలను అలంకరించడంతోపాటు వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన కలశాలను భక్తుల దర్శనార్థం ఉంచారు. అయోధ్యలో జరుగుతున్న బాల రాముని విగ్రహ ప్రతిష్ట మహోత్సవం తిలకించేందుకు ఆలయ కమిటీ నిర్వాహకులు భారీ ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు. అక్కడ జరుగుతున్న ఉత్సవాలను భక్తులు కనులారా వీక్షించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా తిలకించారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన భక్తులకు ఆలయ కమిటీ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అన్న సంతర్పణ ఏర్పాటు చేశారు. సాయంత్రం వివిధ గ్రామాల్లో రామాలయాల్లో ఏర్పాటు చేసిన ఉత్సవ విగ్రహాలను పురవీధుల గుండా ఊరేగించారు.