PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నాగటూరులో  కల్లు లొల్లి..

1 min read

రూ. 5 లకే సీసా కల్లు .

కల్లు లో మోతాదుకు మించి మత్తు పదార్థాలు..?

తాగితే వాంతులు, విరేచనాలు. కీళ్లనొప్పులు..?

చోద్యం చూస్తున్న ఎక్సైజ్‌  శాఖ  అధికారులు.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: బహిరంగ మార్కెట్ లో లీటరు నీళ్లు రూ.5 నుంచి రూ. 10 ఉంటుంది. చక్కెర కీలో రూ.15 వరకు వుంది.అలాంటిది కేవలం రూ.5 లకే సీసా కల్లు అమ్మడం సాధ్యమేనా.. అంటే సాధ్యమే అంటున్నారు నాగటూరు ప్రజలు.నందికొట్కూరు మండలం నాగటూరు గ్రామంలో రూ.5లకే సీసా కల్లు దొరుకుతుంది.అడిగిన వారికి ఇంటి వద్దకే సరఫరా చేయడం జరుగుతుంది .ఈ కల్లు తాగిన వారు వాంతులు, విరేచనాలు, కీళ్ళ నొప్పులు తో బాధపడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తూ కూర్చోవడం పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నందికొట్కూరు ఎక్సైజ్‌ పరిధిలో కల్తీకల్లు వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది. కల్తీకల్లు అమ్మకాలతో పేదల జీవితాలతో దుకాణాల నిర్వాహకులు ఆటలాడుతున్నారు. సాధారణ కల్లుతో మత్తు రావడం లేదని కొందరు ఎక్కువ మత్తు ఇచ్చే ఆల్కాహాల్‌ లిక్కర్‌కు అలవాటు పడ్డారు. దీంతో కల్లు అమ్మకాలు తగ్గాయి. దీంతో కల్లు వ్యాపారులు లిక్కర్‌ కంటే ఎక్కువ మత్తు ఇచ్చేలా వివిధ రసాయనాలు వేసి కల్తీకల్లు తయారు చేస్తున్నారు. సాధారణ లిక్కర్‌తో పోలిస్తే కల్తీకల్లు రేటు తక్కువ ఉండడంతో పేదలు కల్తీకల్లుకు అలవాటు పడుతున్నారు. కల్తీ కల్లు తాగితే నాడీ మండల వ్యవస్థ, నరాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అది దొరకకుంటే మతి స్థితిమితం తప్పిన వారిలా ప్రవర్తిస్తుంటారు. పలువురు నాసిరకం  కల్తీ కల్లును తాగిరోగాల బారిన పడుతున్నారు. కల్లులో మోతాదుకు మించి మత్తు పదార్థాలు ఉండటంతో  పలువురు మూర్ఛతో బాధపడుతున్నారు.వ్యాపారులు నిషేధిత పదార్థాలతో కల్తీకల్లు తయారు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.మండలం లోని నాగటూరు గ్రామంలో ఒక కల్లు దుకాణం యజమాని రూ.5 లకే సీసా కల్లు అమ్ముతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ లేని విదంగా ఇక్కడ మాత్రమే రూ.5 లకు సీసా కల్లు దొరుకుతుంది. అసలు ఈ కల్లు మంచిదా లేక కల్తీకల్ల అని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. కల్లులో మత్తు ఎక్కించే క్లోరోహైడ్రేట్‌, డైజోఫాం,సిల్వర్‌యాష్‌, కట్టామీటా, సిల్వర్‌ నైట్రేడ్‌ల తదితర మత్తు పదార్థాలు కలుపుతున్నట్లు సమాచారం. అధికారులు కల్తీ వ్యాపారాన్ని చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు దుకాణం యజమానిని హెచ్చరించిన అధికార పార్టీ నాయకుల అండతో అధికారుల ఆదేశాలను పట్టించుకోవడం లేదని విశ్వనీయ సమాచారం.

సమన్వయ లోపం..

ఎక్సైజ్ శాఖ, సెబ్, ఎక్సైజ్ విజిలెన్స్ అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తున్నారు. ఏదేని  సంఘటన జరిగినప్పుడు మాత్రమే దాడులు చేసి వదిలేస్తున్నారనే ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి. ఎక్సైజ్ శాఖకు జిల్లా స్థాయిలో మాత్రమే కార్యాలయం ఉండడంతో కల్లు దుకాణాలపై పర్యవేక్షణ కొరవడింది. సెబ్, ఎక్సైజ్ విభాగాలుగా విడిపోవడంతో అధికారుల మధ్య సమన్వయ లోపం నెలకొంది.ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయంపై అధికారులను ఫోను ద్వారా సంప్రదించగా స్పందించకపోవడం విశేషం.

About Author