కమణీయం.. సీతారాముల కళ్యాణోత్సవం
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు : నగరంలోని వన్‌టౌన్ వద్దనున్న శ్రీ రామాలయంలో శనివారం సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తిశ్రద్ధలతో అర్చకుల వేమంత్రోచ్చరణాల మధ్య సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, అలంంకారసేవ, అష్టోత్తర శతనామ పూజలు నిర్వహించారు. వధూవరుల పక్షాన ఆలయం ప్రధాన అర్చకులైన మాళిగి హనుమేశాచార్య,భారతి దంపతులు సీతారాముల వివాహాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీసీతారాములు మంటపంలో వేంచేసి భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకస్వాములు పుణ్యహవాచనం,రామస్వామి కి యజ్ఞోపవీత ధారణ, వరపాద ప్రక్షాళన, మధుపర్కం నిర్వహించారు. తదనంతరం తెరసెల్లా అడ్డుపెట్టి వేదవిదులు అందరూ మంగళాష్టకం పఠిస్తూ సుముహూర్త కాలానికి సీతారాములకు జీలకర్ర బెల్లం శిరస్సుపై ఉంచిన దృశ్యం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. కంకణ బంధనం, కన్యాదానం అనంతరం మాంగల్యం తంతునానేనా…లోకరక్షక హేతునా…( లోక రక్షణ కోసమే జగద్రక్షకులైన మీ కళ్యాణమని) అంటూ మాంగల్య ధారణ జరిగింది… ముత్యాల తలంబ్రాలను రామస్వామికి సీతామహాదేవి కి ధారగా వేసిన అనంతరం సీతమ్మ వారికి వడిబియ్యం కట్టి… సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయస్వామి ని ప్రజలందలందరినీ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర సహకార్యదర్శి యస్.ప్రాణేష్,నగర కార్యదర్శి మాళిగి భానుప్రకాష్ ,ఆలయకార్యనిర్వహణాధికారి దినేష్ తదితరులు పాల్గొన్నారు.