పురుషార్థసాధనకు సరిలేనికాలం కార్తికమాసం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కార్తిక మాసం ప్రజలను స్నాన, దీప, దాన, వన భోజన కార్యక్రమాలతో మానవులు తరింప చేసే ఉపాసనా కాలమని, దీనిని సద్వినియోగం చేసుకోవలసిన ఆవశ్యకత ప్రతి ఒక్కరి కర్తవ్యం అని ప్రముఖ ధార్మికోపన్యాసకులు డాక్టర్ తొగట సురేశ్ బాబు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో కల్లూరు మండలం పెద్దటేకూరు గ్రామంలోని శ్రీ సిద్ధ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తికమాస ధార్మిక సప్తాహంలో భాగంగా ఏర్పాటుచేసిన ధార్మికోపన్యాస కార్యక్రమంలో గురు వైభవం, కార్తీకమాస విశిష్టత గురించి, హరిహర తత్వం గురించి ప్రవచించారు. అజ్ఞాన అంధకారంతో నిండిన ఈ ప్రపంచంలో జ్ఞాన జ్యోతిని వెలిగించే వాడు గురువని, అలాంటి గురుపద సేవ జీవన్ముక్తికి సోపానమని తెలిపారు. కార్తికమాసం హరి హరులకు సమ ప్రాధాన్యత ఇస్తూ ఇరువురిని అర్చన చేసుకోదగిన కాలమని ముఖ్యంగా దీపాలను వెలిగించడం ద్వారా పరమ పుణ్యాన్ని సంపాదించుకో గలుగుతామని, వనభోజనం ద్వారా సర్వ మానవ సమానత్వం అభివృద్ధి చేయగలుగుతాయని, నిత్య స్నాన ఫలితంగా ఆరోగ్యాన్ని పొంది మంచి సమాజాన్ని రూపొందించ గలుగుతామని తెలిపారు. ఉపాసనకు అనుకూలమైన ఈ కార్తికమాసాన్ని సద్వినియోగ పరచుకోవడమనేది విచక్షణపై ఆధారపడి ఉంటుందని ప్రతి ఒక్కరు పురుషార్థసాధనలో ఈ కార్తికమాసాన్ని ఒక ఉపకరణంగా ఉపయోగించుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో మఠాధిపతి శ్రీ ఎల్లప్ప స్వామి, మఠం ట్రస్టీ జ్ఞానేశ్వర్, తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే ధర్మ ప్రచార మండలి సభ్యులు బి. శ్రీరాములు , వైద్యం గిడ్డయ్య సాహితీ సేవాసమితి అధ్యక్షులు వైద్యం రామానాయుడు, సత్సంగ ప్రముఖ్ బండారు రామకృష్ణ, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కొరపోలు స్వయంప్రభ, నరసింహారావు, హరి,భజన మండలి అధ్యక్షులు శివారెడ్డి, ఎల్లయ్య, శేఖర్, ఘణ, బొగ్గుల శివారెడ్డి, సుంకన్నతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.