అల్లా దీవెనలతో..ముస్లింలను క్షేమంగా చూసుకుంటా..
1 min readటీడీపీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి టి.జి. భరత్
- బిస్మిల్లా ఫంక్షన్ హాలులో ఇఫ్తార్ విందులో పాల్గొన్న టి.జి భరత్
కర్నూలు, పల్లెవెలుగు: అల్లా దీవెనలతో కర్నూల్లోని ముస్లింలను క్షేమంగా చూసుకునే బాధ్యత తనదని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భరత్ అన్నారు. నగరంలోని బిస్మిల్లా ఫంక్షన్ హాలులో టిడిపి నగర అధ్యక్షుడు హమీద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో టిడిపి రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడు ముస్తాక్ మౌలానాతో కలిసి టి.జి భరత్ పాల్గొన్నారు. అనంతరం ముస్లిం మహిళలతో ఏర్పాటుచేసిన ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ముస్లింలు ఎంతో లబ్దిపొందుతారన్నారు. ఈ పథకాలన్నీ సక్రమంగా అందాలంటే స్థానికంగా ప్రజలకు సేవ చేసే తనలాంటి నాయకుడు ఉండాలన్నారు. అందుకే రాష్ట్రానికి చంద్రబాబు, కర్నూలుకు తాను అవసరమన్నారు. 2019లో కులం, మతం డ్రామాలో పడి ఓట్లు వేసి ముస్లింలు ఎంతో నష్టపోయారన్నారు. ఇప్పుడు మళ్లీ అలాంటి మాయలో అస్సలు పడొద్దని చెప్పారు. సీఏఏ, ఎన్.ఆర్.సి ఇలా ఏ బిల్లు వచ్చినా తాను అండగా ఉంటానని మాటిస్తున్నప్పుడు ముస్లిం సోదర, సోదరీమణులకు ఆందోళన అవసరం లేదన్నారు. ఒక్క కుటుంబానికి ఎమైనా ఇబ్బంది కలిగినా తన ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేస్తానని ఇది వరకే స్పష్టం చేశానని గుర్తు చేశారు. ప్రత్యర్థి పార్టీ నాయకుడు స్థానికేతరుడన్నారు. స్థానికంగా ఉన్న నాకు ఇక్కడి ప్రజలతో ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు. వైసీపీ వాళ్లు చెప్పే మాయమాటలు నమ్మొద్దని.. తనకు ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇవ్వాలని టి.జి భరత్ కోరారు. అనంతరం టిడిపి రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడు ముస్తాక్ మౌలానా మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో ముస్లింల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చామన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక అన్నీ తీసేశారన్నారు. దుల్హన్ కు కొర్రీలు పెట్టారన్నారు. రంజాన్ తోఫా ఇవ్వడం లేదన్నారు. మళ్లీ చంద్రబాబు నాయుడు వస్తే ఇవన్నీ అమలు చేస్తామన్నారు. కర్నూల్లో ప్రజాసేవ చేసే టి.జి భరత్ ను ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు. ముస్లింలకు అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ ఖాజా మోయినుద్దీన్, రమీజ్, అజ్మత్, ముస్తాక్, ఖాజా, కలాం, తదితరులు పాల్గొన్నారు.