NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మేయర్​ గారు.. నోరు అదుపులో పెట్టుకోండి…

1 min read

– లేదంటే నీ చిట్టా విప్పుతా ..

  • –  దమ్ము ఉంటే మేయర్ పదవికి రాజీనామా చేయండి
  • టీడీపీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి టీజీ భరత్​

కర్నూలు, పల్లెవెలుగు: కర్నూల్ ప్రజలు దోమలు, డ్రైనేజీ, చెత్త పన్ను, ఇంటి పన్నుల సమస్యలతో బాధపడుతుంటే పరిష్కరించలేని మేయర్ బీవై రామయ్య.. ఎన్నికలు వచ్చాయని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ మండిపడ్డారు. ధర్మపేటలో టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమం ఆయన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్నూలులో ఎటుచూసినా సమస్యలే ఉన్నాయన్నారు. సమస్యలు తీర్చలేని వ్యక్తికి మేయర్ పదవి ఎందుకని మండిపడ్డారు. తమ కుటుంబంపై నోటికి వచ్చినట్లు అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. మేయర్ నోరు అదుపులో పెట్టుకోకపోతే ఆయన చిట్టా మొత్తం విప్పుతానని టీజీ భరత్ హెచ్చరించారు. కార్పొరేషన్ సరిగా నడపలేని వ్యక్తికి ఎంపీ టికెట్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఎంపీగా గెలవలేమోనని భయంతోనే మేయర్ తన పదవికి రాజీనామా చేయకుండా ఉన్నారని అన్నారు. కర్నూలులో ఎన్నికల ప్రచారం ప్రశాంతంగా సాగుతుందని.. వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడితే చూస్తు ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారు. కర్నూలు కార్పొరేషన్‌లో ఒక్క పని చేయలేదని.. తన వెంట వస్తే ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూపిస్తానని అన్నారు. ప్రజల సమస్యలు తీర్చాల్సిన బాధ్యత మేయర్ మీద ఉందన్నారు. ఇతరులను అనే ముందు మనవైపు నాలుగు వేళ్లు చూపిస్తాయని తెలుసుకోవాలని మేయర్‌కు హితవు పలికారు. దమ్ము ఉంటే ముందు మేయర్ పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీలో ఉండాలని సవాల్ విసిరారు. మరోసారి చెబుతున్నానని.. మేయర్ నోరు అదుపులో పెట్టుకోకపోతే చిట్టా మొత్తం విప్పుతానని అన్నారు. తనను గెలిపిస్తే ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తానని హామీ ఇస్తూ.. ప్రచారం చేస్తూ ప్రజల్లోకి వెళుతున్నానని అన్నారు. ఆరు గ్యారంటీలను ఐదేళ్లలో అమలు చేయకపోతే రాజకీయాలను తప్పుకుంటానని.. ఇలా చెప్పిన నాయకుడు దేశంలో ఎవరు లేరని అన్నారు. తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే తన పనితీరు ఎలా ఉంటుందో తెలుస్తుందని టీజీ భరత్ పేర్కొన్నారు.

About Author