అలీ, పోసాని కృష్ణ మురళికి కీలక పదవులు ?
1 min read
పల్లెవెలుగువెబ్ : వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్న టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళి, అలీలకు ఏ రకమైన పదవులు ఇస్తారనే అంశంపై ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంది. అలీని వైసీపీ తరపున రాజ్యసభకు పంపుతారని అప్పట్లో ఊహాగానాలు వచ్చాయి. కానీ అలా జరగలేదు. ఆయనకు ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి ఇచ్చి కేబినెట్ ర్యాంకు ఇస్తారని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అలీ, ఆయనతో పాటు వైసీపీలో మొదటి నుంచి కొనసాగుతున్న మరో నటుడు పోసాని కృష్ణమురళికి నామినేటెడ్ పదవులు కేటాయించే అంశంపై ఏపీ సీఎం జగన్ ఓ నిర్ణయం తీసుకున్నారనే చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. అలీని ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించాలని సీఎం జగన్ నిర్ణయించినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఇక పోసాని కృష్ణమురళికి కీలకమైన ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కనుందని సమాచారం. ఈ ఇద్దరికి పోస్టులు కేటాయించే అంశానికి సంబంధించిన ఫైలు సీఎం జగన్ దగ్గరకు చేరిందని.. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రావొచ్చని అంటున్నారు.