కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. అనంతపురం వాసి !
1 min readపల్లెవెలుగువెబ్ : కేజీఎఫ్ సినిమాతో ప్రశాంత్ నీల్ సంచలనం సృష్టించాడు. రెండో సినిమాతోనే పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ బద్దలుకొట్టాడు. ప్రశాంత్ నీల్ ఎవరన్న ఆసక్తి ప్రజల్లో పెరిగింది. కేజీఎఫ్ -2 విడుదల తర్వాత ప్రశాంత్ నీల్ ఎవరన్న విషయం వెలుగులోకి వచ్చింది. ప్రశాంత్ నీల్‌ది మడకశిర నియోజకవర్గం నీలకంఠాపురం స్వగ్రామం. మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి సోదరుడు సుభాష్, భారతి దంపతుల కుమారుడు. అయితే వీరి కుటుంబం బెంగళూరులోనే స్థిరపడింది. కొన్నేళ్ల క్రితం మృతి చెందిన తన తండ్రి సుభాష్ మృతదేహాన్ని నీలకంఠాపురంలోనే ఖననం చేయడంతో ప్రశాంత్‌నీల్ అప్పుడప్పుడూ కుటుంబంతో కలిసి గ్రామానికి వచ్చి వెళుతుంటారు. తాజాగా ఈనెల 14న కేజీఎఫ్–2 రిలీజ్ రోజున స్వగ్రామం వచ్చి తండ్రి సమాధిని సందర్శించి వెళ్లారు. ప్రశాంత్ విద్యాభ్యాసం బెంగళూరులో సాగింది. వారి కుటుంబానికి బెంగళూరులో హాయ్‌ల్యాండ్ ఉండేది. అక్కడ ఎక్కువగా సినీ షూటింగ్‌లు జరిగేవి. దీంతో ప్రశాంత్ తరచూ అక్కడికి వెళ్లి సినీ చిత్రీకరణ చూసేవారు. ఈ క్రమంలోనే సినిమాలపై మక్కువ పెంచుకున్నారు. డిగ్రీ తర్వాత ఎంబీఏ కోర్సులో జాయిన్ అయిన ప్రశాంత్ నీల్ సినిమాలపై మక్కువతో ఫిల్మ్ స్కూల్లో చేరి అన్ని విభాగాలపై అవగాహన పెంచుకున్నాడు. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ తో సలార్ మూవీ తెరకెక్కిస్తున్నారు.