కిడ్నీల ఆరోగ్యంపై అవగాహనకు కిడ్నీ రన్
1 min read* ప్రారంభించిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
* ఏఐఎన్‌యూ పరుగులో పాల్గొన్న 1500 మంది
పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్: ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా కిడ్నీల ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) ఆధ్వర్యంలో నగరంలో ఆదివారం ఉదయం కిడ్నీ రన్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో పలువురు కిడ్నీ రోగులు, వైద్యరంగ నిపుణులు, సాధారణ ప్రజలు అందరూ కలిపి 1500 మందికి పైగా పాల్గొన్నారు. ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి (సీకేడీ) గురించి అవగాహన పెంచడానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సమస్యను ఎదుర్కోవడండలో ప్రజలందరి భాగస్వామ్యన్ని పెంచడానికి ఇదో మంచి ముందడుగని ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 85 కోట్లమంది సీకేడీ బాధితులు ఉన్నారు. అందరికీ కిడ్నీ ఆరోగ్యం – అందరికీ సమానంగా చికిత్స అవకాశాలు, తగిన వైద్య చికిత్సలు అన్నది ఈ సంవత్సరం ప్రపంచ కిడ్నీ డే థీమ్. ఇందుకు అనుగుణంగానే ఏఐఎన్‌యూ వ్యవహరిస్తోంది. సీకేడీని ఎదుర్కోవడానికి సమగ్ర వ్యూహాలను అనుసరిస్తూ, చికిత్సలలో అత్యాధునిక పద్ధతులను అవలంబించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతోంది. అవగాహన లేకపోవడం, కొత్త చికిత్స వ్యూహాలపై పరిమిత పరిజ్ఞానం, కిడ్నీ నిపుణుల కొరత, అధిక ఖర్చుల కారణంగా కిడ్నీల చికిత్సకు అందరికీ సమాన అవకాశాలు ఉండట్లేదు. ఈ సవాళ్లను అధిగమించేందుకు ఏఐఎన్‌యూ నిర్వహించిన ఈ కిడ్నీ రన్ ఒక శక్తివంతమైన వేదికగా పనిచేసింది.ప్రస్తుత ఆరోగ్య విధానాలలో కిడ్నీ ఆరోగ్యాన్ని సమీకృతం చేయాలని వాదించడం, రోగులకు అనుకూలమైన విధానాలను ప్రోత్సహించడం, ప్రజల సాధికారతను ప్రోత్సహించడం ద్వారా, కిడ్నీ ఆరోగ్యంపై అవగాహన, చికిత్సకు గణనీయంగా దోహదం చేయాలని ఏఐఎన్‌యూ లక్ష్యంగా పెట్టుకుంది.ఈ సందర్భంగా ఏఐఎన్‌యూకు చెందిన నెఫ్రాలజిస్టు డాక్టర్ వరుణ్ మాట్లాడుతూ, పరుగులో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. “ఏఐఎన్‌యూ కిడ్నీ రన్‌కు లభించిన ఈ అపార ఆదరణ చూస్తుంటే మన సమాజంలో కిడ్నీల ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో, గుర్తింపు ఎంతగా పెరుగుతోందో అర్థమవుతుంది. ఈ సమిష్టి కార్యక్రమానికి అందరూ కలిసి రావడం ద్వారా దీనిపై అవగాహన పెంచడమే కాక, సీకేడీ బాధితులకు మంచి ఫలితాలు రాబట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు” అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా, ఆస్పత్రికి చెందిన వైద్యులు డాక్టర్ సి. మల్లికార్జున, డాక్టర్ పీసీ రెడ్డి, డాక్టర్ దీపక్ రాగూరి, డాక్టర్ క్రాంతి, డాక్టర్ వరుణ్, డాక్టర్ తైఫ్, డాక్టర్ లీలాకృష్ణ తదితరులు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు.