ముందస్తు జాగ్రత్తలతో..‘కిడ్నీ’ సేఫ్…!
1 min readవ్యాయామం అత్యవసరం…
- పౌష్టిక ఆహారం తప్పనిసరి…
- ధూమ,మద్యపానంకు దూరంగా ఉంటే కిడ్నీ .. సురక్షితం.
- వాణి నెఫ్రోకేర్ కిడ్నీ వ్యాధి వైద్య నిపుణులు డా. సాయివాణి
- 14న ప్రపంచ కిడ్నీ డే..
పల్లెవెలుగు, కర్నూలు: ప్రపంచంలో ప్రతి పది మందిలో ఒకరు కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నారని, రక్తపోటు ఉన్న ప్రతి ఐదుగురిలో ఒకరు, మధు మేహం ఉన్న ప్రతి ముగ్గురిలో ఒకరు మూత్ర పిండాల వ్యాధితో అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు వాణి నెఫ్రోకేర్ కిడ్నీ వ్యాధి వైద్య నిపుణులు డా. సాయివాణి. ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా నగరంలోని ఎన్ ఆర్ పేటలోని వాణి నెఫ్రోకేర్ క్లినిక్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డా. సాయివాణి మూత్ర పిండాల వ్యాధి నివారణపై మాట్లాడారు.
అందుబాటులో… కిడ్నీ వైద్యం..:
ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా.. ఈ ఏడాది అందరికీ అందుబాటులో కిడ్నీ వైద్యం, ప్రతి ఒక్కరికీ ఉచిత చికిత్స.. అనే నినాదంతో ముందుకు సాగుతోందన్నారు. మూత్ర పిండాల వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందు పంపిణీ , ఖరీదైన వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశ్యమన్నారు.
కిడ్నీ వ్యాధి…లక్షణాలు:
లక్షణాలు అనేవి మొదట వ్యాధికి కారణాన్ని బట్టి ఉండవచ్చును. దీర్ఘ కాలిక జబ్బుల వల్ల మూత్ర పిండాలు పాడై ఉంటే.. ముందుగా మొహం వాపు, తరవాత కాళ్లు, శరీరం అంతా వాపు రావొచ్చు. మూత్రం సరిగ్గా రాకపోవడం, నడిస్తే ఆయాసం, పడుకుంటే ఆయాసం రావడం సాధారణంగా ఉంటాయి. ఒకవేళ మూత్ర పిండాలలో రాళ్లు ఉంటే ..నడుములో నొప్పి, అక్కడి నుంచి గజ్జల్లోకి రావడం, చలి జ్వరం, మూత్రంలో మంట వంటి లక్షణాలతో ప్రారంభం అవ్వచ్చు. ఇతర ఏవైనా ఇన్ఫెక్షన్ల వల్ల మూత్ర పిండాలు పాడై ఉంటే వాటికి సంబంధించిన వ్యాధి లక్షణాలు తెలియకపోతే… దగ్గరలోని నెఫ్రాలజి వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.
వ్యాధినివారణ… చర్యలు..:
మూత్ర పిండాల వ్యాధుల నివారణకు …జాగ్రత్తలు అత్యవసరం. సరైన సమయంలో మందులు వినియోగిస్తే కిడ్నీ వ్యాధులను కంట్రోల్ చేయవచ్చు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాధుల నివారణకు ప్రత్యేక చొరవ తీసుకోవాలి. ఆరోగ్య వ్యవస్థ బలంగా ఉంటే…. కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉండదు. కిడ్నీ వ్యాధులపై ముందుకు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి.
వ్యాయమం…ఆహారం…:
కిడ్నీ వ్యవస్థ దెబ్బతినకుండా ఉండాలంటే…. ప్రతి రోజు గంటపాటు వ్యాయామం తప్పనిసరిగా తీసుకోవాలి పౌష్టిక ఆహారం తీసుకోవాలి. . చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ధూమ, మద్యంపానంకు దూరంగా ఉండాలి. మధు మేహం ఉన్న వారు షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలి. బీపీ ఉన్న వారు బీపీ కంట్రోల్ చేసుకోవాలి. అధిక ఒత్తిడికి గురి కాకూడదు. మానసికంగా.. శారీరకంగా ధృఢంగా ఉండాలి.
ఫ్యామిలి వైద్యులతో… సంప్రదింపులు..:
మధుమేహం, బీపీ, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతే వారు…వారివారి ఫ్యామిలీ వైద్యలతో చికిత్స చేయించుకోవాలి. సంవత్సరంలో ఒక్కసారైనా కిడ్నీలను కాపాడుకునేలా చికిత్స చేసుకోవాలి. కిడ్నీ వ్యాధి లేని వారు కూడా ఏడాదికోసారి పరీక్షలు చేయించుకోవడం మంచిదని నెఫ్రాలజి వైద్య నిపుణులు డా. సాయివాణి వెల్లడించారు.