అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్న కొల్లేరు ప్రజల పరిరక్షణ సంఘం
1 min readఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు అడ్వకేట్ తో సంప్రదింపులు
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: సర్వే నంబర్ల ఆధారంగా కాంటూరు సరిహద్దులు నిర్ణయించకుండా కొల్లేరు ప్రాంత ప్రజల జీవనాధారం దెబ్బతీసే విధంగా 77 వేల ఎకరాల్లో ఇష్టానురాజ్యంగా చేపట్టిన విధ్వంసంపై అత్యున్నత న్యాయస్థానంలో తమ వాదనలు వినిపించే దిశగా కొల్లేరు ప్రజల పరిరక్షణ సంఘం కార్యచరణ రూపొందించింది. దీనిలో భాగంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆధ్వర్యంలో కొల్లేరు ప్రజల పరిరక్షణ సంఘం ప్రతినిధులు మంగళవారం సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ నాగేశ్వరరెడ్డిని కలిసి సంప్రదింపులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అమలు చేయకుండా కొల్లేరు ప్రాంత ప్రజల పొట్ట కొట్టిన విషయాన్ని, కొల్లేరు ప్రాంతంలో ఆక్రమణలు లేకపోయినప్పటికీ గత ప్రభుత్వ పెద్దలు తెరవెనక ఉండి కొందరు వ్యక్తులతో న్యాయస్థానంలో కేసులు వేయించడం వల్ల ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఎంపీ మహేష్ కుమార్ సీనియర్ అడ్వకేట్ నాగేశ్వర రెడ్డికి వివరించారు. కొల్లేరు ప్రాంత ప్రజల జీవనానికి ఇబ్బందులు ఎదురైతే తమను ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో స్పష్టంగా పేర్కొన్న నేపథ్యంలో కొల్లేరు ప్రాంత ప్రజల తరఫున న్యాయస్థానంలో వాదనలు వినిపించి వారికి న్యాయం చేయాలని ఎంపీ మహేష్ కుమార్ సీనియర్ అడ్వకేట్ నాగేశ్వరరెడ్డికి విజ్ఞప్తి చేశారు. కొల్లేరు ప్రాంతంలో ధ్వంసం చేసిన 15 వేల ఎకరాల జిరాయితీ భూములు వెనక్కి ఇవ్వడంపై ఒక రిట్ పిటిషన్, తమకు న్యాయం చేయాలని కోరుతున్న కొల్లేరు ప్రాంతంలో దీర్ఘకాలికంగా నివసిస్తున్న ప్రజలకు తరుపున మరొక రిట్ పిటిషన్ దాఖలు చేయడానికి అవసరమైన నివేదికలను ఎంపీ మహేష్ కుమార్ సీనియర్ అడ్వకేట్ నాగేశ్వరరెడ్డికి అందజేశారు. కొల్లేరు ప్రాంత ప్రజల సమస్యల పట్ల సానుకూలంగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు న్యాయ సహాయం అందించడానికి ముందుకు వచ్చిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు కొల్లేరు ప్రజల పరిరక్షణ సంఘం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే అసెంబ్లీలో మరోసారి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడానికి అంగీకరించిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. సీనియర్ అడ్వకేట్ ను కలిసిన వారిలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, కొల్లేరు ప్రజల పరిరక్షణ సంఘం ప్రతినిధులు సైదు సత్యనారాయణ, నంబూరి శివాజీ రాజు, బలే యేసు రాజు, కొల్లి వరప్రసాద్ (బాబి), ఘంటసాల మహాలక్ష్మి రాజు, బికేఎం నాని, తదితరులు ఉన్నారు.