కొల్లేరు సమస్యలను అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పరిష్కరించాలి..
1 min readఅరుణోదయ విమలక్క కొల్లేటి పాట ఆవిష్కరణ..
100 ఏళ్లుగా కొల్లేరులో పక్షులు మాత్రమే కాదు, మనుషులు కూడా ఉన్నారు..
కొల్లేరు ఉద్యమ కారిణి డాక్టర్ఘంటసాల వెంకటలక్ష్మి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : కొల్లేటి మంచినీటి సరస్సుకు దాదాపు 20 లక్షల సంఖ్యలో ప్రపంచం నలుమూలల నుండి తరలివస్తున్న రకరకాల పక్షులతో కొల్లేరుకు అంతర్జాతీయ గుర్తింపు సాధించి పెట్టాయని తద్వారా ఇది ప్రభుత్వాలకు వందల, వేల కోట్ల ఋణాలకు తనఖా (మార్ట్ గేజ్ ) వస్తువుగా మారిపోయిందనిపాండిచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి, మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు అన్నారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక వైఎమ్ హెచ్ఏ హాలు నందు బుధవారం ఉదయం కొల్లేరు బతుకు చిత్రంపై అరుణోదయ విమలక్క పాట ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా కొల్లేటి ఉద్యమ కారిణి డాక్టర్ ఘంటసాల వెంకటలక్ష్మి మాట్లాడుతూ కొల్లేరు ప్రాంతం పక్షుల అభయారణ్యంగా, ఎకో సెన్సిటివ్ జోన్గా, జీవో నెం. 120 తదితర రకరకాల జీఓలతో కొల్లేటిపై అనేక ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. అయితే గత 100 ఏళ్లుగా కొల్లేరంటే పక్షులు మాత్రమే కాదు-మనుషులు కూడా అంటూ అనేక సంస్థలు ఆవిర్భవిస్తూ కొల్లేటి జనశక్తి ఘోషిస్తూనే ఉందని, చిరస్మరణీయులు సైదు గంగరాజు నుండి (1922-2006), నడిచే చరిత్రగా మన మధ్య ఉన్న కొల్లేటి కవి చింతపల్లి వెంకట నారాయణల వరకు కవితలు, పాటలు, వ్యాసాలు, విజ్ఞాపనల పేరు మీద కొల్లేటి ప్రజల గుండెచప్పుడు వినిపిస్తూనే ఉందన్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మాజీ కేంద్రమంత్రి చిరంజీవి, పవన్ కళ్యాణ్, జయప్రకాష్ నారాయణ, జెడి లక్ష్మినా రాయణ తదితర ఎంతో మంది నాయకులు ఈ ప్రాంతాన్ని పర్యటిస్తూ ప్రజల డిమాండ్లకు ప్రాణం పోస్తూనే ఉన్నారని దీనిపై సినిమాలు, పాటలు, కవితలు, పుస్తక సంపుటాలు లెక్కకు మించి వచ్చాయని, చంద్రునికో నూలు పోగు అన్నట్లు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ( ఏసిఎఫ్ ) కూడా కొల్లేటి గుండెచప్పుడు దండోరేసి చాటడానికి ఒక పాటను రూపొందించిందని పక్షులు-ప్రజలు- పర్యావరణం -జీవనాధారం లాంటి బహుముఖ సమస్యలను లేవనెత్తుతూ రూపొందిన ఈ పాట ప్రజా విప్లవ కవి మిత్ర (అమర్) స్వయంగా కొల్లేరు పర్యటించి రచించారన్నారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలుగు రాష్ట్రాల గౌరవాధ్యక్షు రాలు విమలక్క గానం చేసి, కొల్లేరు లోనే చిత్రీకరణ పూర్తి చేశారని, ఈ ప్రాంతవాసి ప్రముఖ సంగీత దర్శకులు కొక్కిలిగడ్డ ఎఫ్రైమ్ సంగీతం సమకూర్చారు. తెలంగాణ ధూంధాం ద్వారా సుపరిచితుడైన అంతడుపుల నాగరాజు దీనితో పాటు వందలాది పాటలకు కొరియోగ్రాఫర్ గానే గాకుండా ఈ పాటకు దర్శకులుగా కూడా వ్యవహరించి కూర్పు పూర్తిచేశారు. కెమెరా మెన్ చిక్కు, అసిస్టెంట్ కెమెరామెన్ శివ, డ్రోన్ కార్తీక్ లు దీనిని అందంగా చిత్రీకరించారు. బృందగానంలో, చిత్రీకరణలో చందు, రాకేష్, సుధాకర్, పోతుల రమేష్, ఖ్యాతి ఎంతోమంది పాల్గొన్నారు. పవన్, పార్టు, సాయి, గోపి లు ఉన్నారు. అరుణోదయ విమలక్క స్వయంగా పాటలు పాడి వినిపించారు. ముందుగా కొల్లేటి ప్రజానాయకుడుసైదు గంగరాజు చిత్ర పఠానికి నేతలు నివాళులర్పించారు. అనంతరం వడ్డీల కార్పొరేషన్ చైర్మన్ ముంగర సంజీవ్ కుమార్, పైడి చింతపాడు గామ సర్పంచ్ ముంగర తిమోతీ, మాజీ సర్పంచ్ ముంగర వెంకటేశ్వరరావు, గ్రామ పెద్దలు పాటలను ఆవిష్కరించారు. ఈకార్యక్ర మంలో ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, హైకోర్టు న్యాయవాది సైకం రాజశేఖర్, వడ్డీల సాధికారిక కమిటి రాష్ట్ర ఛైర్మన్ బలే ఏసురాజు, రాష్ట్ర మత్స్యకార నాయకులు గంజి చంద్రమౌళి, పలువురు కొల్లేరు నాయకులు, కొల్లేరు ప్రాంత ప్రజలు తదితరులు పాల్గొన్నారు.