కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం
1 min read
పల్లెవెలుగు వెబ్: కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నిక సస్పెన్స్‌కు తెరపడింది. ఎన్నో నాటకీయ పరిణామాల అనంతరం మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకోంది. ఎంపీ కేశినేని నాని ఓటుతో టీడీపీకి మెజార్టీ రావడంతో చైర్మన్‌గా చెన్నుబోయిన చిట్టిబాబును టీడీపీ సభ్యులు ఎన్నుకున్నారు. వైస్ చైర్మన్‌గా చుట్టుకుదురు శ్రీనివాసరావు, రెండో వైస్ చైర్మన్‌గా కరిపికొండ శ్రీలక్ష్మీ ఎన్నికైంది. అయితే హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఫలితాలను అధికారులు అధికారికంగా ప్రకటించలేదు.
కొండపల్లి మున్సిపాలిటీలోని 29 వార్డులకు ఎన్నికలు జరగ్గా.. టీడీపీ 15, వైసీపీ 14 స్థానాల్లో విజయం సాధించాయి. అయితే మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా టీడీపీ, వైసీపీ మధ్య వివాదం చెలరేగడంతో పలువురు టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాల ప్రకారం ఇవాళ 10.30 గంటలకు ఎన్నిక నిర్వహించారు. ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఓటును వినియోగించుకున్నారు. అయితే ఎంపీ కేశినేని నాని ఓటుతో టీడీపీ బలం 16కు చేరింది. దీంతో మున్సిపల్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. ఎన్నిక సందర్భంగా దాదాపు 500 మంది పోలీసులతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.