PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కొలిచేవారికి కొంగు బంగారం శ్రీ కాశీ చంద్రమౌళీ శ్వర స్వామి

1 min read

–నేటి నుంచి 22 వరకు బిజినేముల గ్రామంలో స్వామివారి ఉత్సవాలు.
20 న సోమవారం సాయంత్రం రథోత్సవం..
– పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్న ఆలయ కమిటీ సభ్యులు..
చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా తరలిరానున్న భక్తులు.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం బిజినవేముల గ్రామంలో వెలిసిన శ్రీశ్రీ కాశీ చంద్రమౌళీశ్వర స్వామి భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భక్తులు ఆరాధిస్తారు. ప్రతి ఏడాది మహా శివరాత్రి సందర్భంగా గ్రామంలో ఉత్సవాలను ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచి, ప్రజల సహకారంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా చుట్టుపక్కల గ్రామాలు కొణిదెల, నాగటూరు, మల్యాల, నందికొట్కూరు, మద్దిగట్ల గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చి స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు .ఈ నెల 18 న స్వామి వారి కళ్యాణం తో ఉత్సవాలు ఘనంగా ప్రారంభమై 22 న తీర్థావళి తో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ సందర్భంగా గ్రామంలోని స్వామి వారి ఆలయాన్ని అంత్యంత సుందరంగా విద్యుత్ దీపాల అలంకరణతో ముస్తాబు చేశారు. శివరాత్రి సందర్భంగా నిర్వహించే ఉత్సవాలకు గ్రామంలో పలు వీధులు ముస్తాబు చేస్తున్నారు.ఈ ఉత్సవాలు 18 నుంచి 22 తేదీ వరకు నిర్వహించే ఉత్సవాలను ప్రధాన అర్చకులు వీరేష్ యాదవ్, గ్రామ సర్పంచి రవి యాదవ్, కమిటీ సభ్యులు జి మధు యాదవ్. కిరణ్ రెడ్డి ల ఆధ్వర్యంలో జరుగనున్నాయి. 18 న శనివారము రాత్రి గం. 11-00 లకు శ్రీ హైమావతి కాశీ చంద్రమౌళీశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవము, 19 న ఆదివారము సాయంత్రం గం. 5 లకు ప్రభోత్సవము,20 న సోమవారము సాయంత్రం గం. 5-30 ని.లకు రథోత్సవము, 21న మంగళవారము సాయంత్రం గం. 4-00 లకు పారువేట, 22న బుధవారము ఉదయం గం. 9-00 తీర్థవళి తో ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు.మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా కళాకారుల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో కనుల పండువగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించ నున్నారు.ఉత్సవాల సందర్భంగా ఎద్దుల బండ లాగుడు పోటీలు, కబడ్డీ పోటీలు, పొట్టేలు పోటీలు , తదితర పోటీలను నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు .దేవాలయం ముందు భారీ చలువ పందిళ్లు వేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తాగునీరు, మరుగుదొడ్లు, మూత్ర శాలలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు వాహనాల కోసం పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఆలయ ఆవరణలో వ్యాపారులు షాపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలయ ఆవరణలో చలువ పందిళ్లు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీస్ శాఖ అర్బన్ సీఐ విజయ భాస్కర్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.ఉత్సవ ఏర్పాట్లను గ్రామ సర్పంచ్ రవి యాదవ్ పర్యవేక్షిస్తు న్నారు.ఉత్సవాలకు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరేష్, మహేష్, సురేష్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

About Author