PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కూటమి ఎంపీ టిక్కెట్​కు…పోటీ తీవ్రం..!

1 min read

ఎంపీ డా. సంజీవ్​ కుమార్​ చేరికతో… ఆశావహుల్లో టెన్షన్​..

  • రేసులో డా. చంద్రశేఖర్​, కురువ భాను శంకర్​, పంచలింగాల నాగరాజు..మరికొందరు
  • పక్కా వ్యూహంతో… అడుగులు వేస్తున్న టీడీపీ అధిష్ఠానం
  • ఎప్పటికప్పుడు మారుతున్న సమీకరణాలు..
  • ప్రజా సర్వే ఆధారంగానే.. ఎంపీ టిక్కెట్​ ఖరారు..

రాష్ట్రంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయం…రసవత్తరంగా మారింది. ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థుల ఎంపికలో టీడీపీ అధిష్టానం ఆచి..తూచి అడుగులు వేస్తోంది. ఉన్నత విద్యావంతులు… ప్రజా సేవకులకే టిక్కెట్​ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు సర్వేలపై… సర్వే చేయిస్తూ… రాజకీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటోంది. కర్నూలు (బీజేపీ–జనసేన–టీడీపీ) కూటమి ఎంపీ టిక్కెట్​ కోసం వైద్యులు, ఉన్నత విద్యావంతులు, మేదావులు, రాజకీయ నేపథ్యం ఉన్న వారు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత ఎంపీ డా. సంజీవ్​ కుమార్​ గురువారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో దేశం పార్టీలో చేరడంతో.. ఆశావహుల్లో టెన్షన్​ మొదలైంది. కర్నూలు ఎంపీ టిక్కెట్​ కోసం.. ఎవరికివారు పావులు కదుపుతుంటే… డా. సంజీవ్​ కుమార్​ చేరికతో… పాచిక తిరగబడినట్లయింది.

కర్నూలు, పల్లెవెలుగు:సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో (టీడీపీ–జనసేన–బీజేపీ) నంద్యాల, కర్నూలు కూటమి ఎంపీ టిక్కెట్​ ఆశించే ఆశావహుల్లో టెన్షన్​ మొదలైంది. టీడీపీ అధిష్టానం రెండో జాబితాను విడుదల చేసినా… అందులో ఎంపీ అభ్యర్థులను ప్రకటించలేదు. గురువారం వైసీపీ కర్నూలు ఎంపీ డా. సంజీవ్​ కుమార్​ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో దేశం పార్టీలో చేరడంతో … ఆశావహుల్లో ఉత్కంఠకు తెరలేపింది. కర్నూలు ఎంపీ లేదా ఎమ్మిగనూరు టిక్కెట్​ పై స్పష్టమైన హామీతోనే టీడీపీలో చేరి ఉంటారని టీడీపీ వర్గీయుల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

ఆశావహుల్లో.. ఉత్కంఠ…:

కర్నూలు ఎంపీ టిక్కెట్​ ఆశించే వారి సంఖ్య రోజురోజుకు వ్యూహాత్మకంగా పెరుగుతోంది. విద్యావంతులు, మేధావులు, వైద్యులు, వ్యాపారులు.. ఇలా అన్ని రంగాల వారు ఎంపీ టిక్కెట్​ ఆశిస్తుండటంతో..  ( బీజేపీ–జనసేన– టీడీపీ) కూటమి అభ్యర్థి ఎంపికలో అధిష్టానం తలమునకలవుతోంది. చివరి దాకా కర్నూలు ఎంపీ టిక్కెట్​ను ప్రకటించే అవకాశం కనిపించడంలేదు. దీంతో ఆశావహుల్లో ఉత్కంఠకు దారి తీసింది.

క్యూలో… గెలుపు గుర్రాలు..:

అధికార వైసీపీ కర్నూలు ఎంపీ టిక్కెట్​ను మేయర్​  బి.వై. రామయ్య వాల్మీకి ఇవ్వడంతో… టీడీపీ అధిష్టానం గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తూ ఉంది. సరైన సమయంలో… ధీటైన వ్యక్తిని బరిలో నింపేలా.. టీడీపీ అధిష్ఠానం సమాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. బీజేపీ నుంచి డా. పార్థసారధి, టీడీపీ నుంచి డా. సంజీవ్​ కుమార్​, డా. చంద్రశేఖర్​ యాదవ్​, పంచలింగాల నాగరాజు, కురువ భాను శంకర్​, సత్రం రామకృష్ణుడు వాల్మీకి  ఎంపీ టిక్కెట్​ రేసులో ఉన్నారు. ​

పదునెక్కిన…వ్యూహం…:

ఎంపీ టిక్కెట్​ కోసం ఎవరికి..వారు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ… పార్టీ పెద్దల మెప్పు కోసం పావులు కదుపుతున్నారు. వైసీపీ టిక్కెట్​ వాల్మీకి వర్గానికి ఇవ్వడంతో… టీడీపీ కురువు, యాదవ సామాజిక వర్గానికే టిక్కెట్​ ఇవ్వాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కానీ చేనేత వర్గానికి చెందిన డా. శింగరి సంజీవ్​ కుమార్​ టీడీపీలో చేరడంతో …. శరవేగంగా సమీకరణాలు మారాయి. స్పష్టమైన హామీతోనే … పక్కా ప్లాన్​తో టీడీపీలో చేరినట్లు తెలుస్తోంది.

About Author