PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు కర్నూలు క్రీడాకారులు ఎంపిక

1 min read

ఏకాగ్రత పెంపొందించే… విలువిద్య క్రీడ మన దేశ ప్రాచీన క్రీడ.

సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ.

పల్లెవెలుగు వెబ్  కర్నూలు  : జాతీయస్థాయి ఆర్చరీ క్రీడా పోటీలకు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించే నలుగురు క్రీడాకారులలో కర్నూల్ నగరానికి చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపిక కావడం అభినందనీయమని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. కర్నూల్ నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో జరిగిన కార్యక్రమంలో ఈనెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అహ్మదాబాద్ లో జరిగే జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికైన వెన్నెల, అలెక్స్ మ్యాథ్యు లను డాక్టర్ శంకర్ శర్మ అభినందించారు ఈ సందర్భంగా వారికి విల్లును బహుకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్చరీ సంఘం కార్యదర్శి నాగరత్నమయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ విలువిద్య మన దేశ ప్రాచీన సాంప్రదాయ క్రీడా అని చెప్పారు. విలువిద్య క్రీడలో సాధన చేయడం వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత పెరిగి చదువులోనూ రాణించే అవకాశం ఉంటుందని తెలిపారు. మహాభారత పురాణంలో కూడా అర్జునుడు విల్లు ఎక్కు పెట్టినప్పుడు కేవలం తాను గురిపెట్టిన పక్షి యొక్క కన్ను తప్ప మరి ఏమి కనిపించడం లేదని చెబుతాడని, దీన్ని బట్టి చూస్తే విలువిద్య క్రీడా ఏకాగ్రతకు ప్రత్యక్ష నిదర్శనం అని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుతోపాటు క్రీడల్లో ప్రోత్సహించేందుకు ముందుకు రావాలని చెప్పారు. చాలామందిలో తమ పిల్లలు క్రీడల్లో పాల్గొనడం వల్ల చదువులో వెనుకబడిపోతారని ఆలోచన ఉందని అందులో ఎంత మాత్రం నిజం లేదని క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులోనూ రాణిస్తారని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల ప్రతి ఒక్కరిలో సానుకూల దృక్పథం మెరుగుపడుతుందని వివరించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చిన్నపిల్లలు స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా మారుతున్నారని స్మార్ట్ఫోన్ల వినియోగం హైడ్రోజన్ బాంబు కంటే ప్రమాదకరమైన విషయం అన్నారు. స్మార్ట్ ఫోన్లో వినియోగం వల్ల చిన్నతనంలోనే ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఏ రంగంలో రాణించాలన్న పునాది బలంగా ఉండాలని, అదేవిధంగా విద్యార్థులు క్రీడల్లో సాధన చేయడం వల్ల క్రమశిక్షణ ఏకాగ్రత పెరిగి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని చెప్పారు. జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికైన విద్యార్థులు కర్నూలు పేరును దేశ చిత్రపటంలో నిలిపేలా చేశారని చెప్పారు అహ్మదాబాద్ లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు విజయంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. కర్నూల్ నగరంలో క్రీడల అభివృద్ధికి తన సహకారం ఉంటుందని ఆయన వివరించారు. జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికైన జిల్లాకు చెందిన క్రీడాకారులను సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అభినందించారు.

About Author