మహనీయుల చరిత్ర అందరికీ తెలియజెప్పాలి.. కర్నూలు టిడిపి అభ్యర్థి టి.జి భరత్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: భారతదేశ చిత్రపటంలో చెరగని ముద్ర వేసిన మహనీయుల జీవిత చరిత్ర నేటి తరానికి తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భరత్ అన్నారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఐదు రోడ్ల కూడలిలో ఉన్న ఆయన విగ్రహానికి టి.జి భరత్ పూలమాలలు వేసి స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ అభ్యర్థి నాగరాజు, ఇతర నాయకులు పాల్గొన్నారు. అనంతరం టి.జి భరత్ మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ స్వాతంత్య్ర సమర యోధుడు, సంఘ సంస్కర్త. రాజకీయవేత్త అని కొనియాడారు. మహనీయులు చేసిన త్యాగాలు, కృషి, సేవల ఫలితమే ఇప్పుడు ప్రజలంతా అనుభవిస్తున్న ఈ జీవితమన్నారు. 50 ఏళ్లపాటు పార్లమెంటు సభ్యునిగా బాబు జగ్జీవన్ రామ్ కొనసాగడమే కాకుండా 30 ఏళ్లకుపైగా కేంద్ర మంత్రిగా పనిచేశారని, ఉప ప్రధానిగా పనిచేసి ఎన్నో సంస్కరణలకు జీవం పోశారని పేర్కొన్నారు. వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న సమయంలో హరితవిప్లవానికి నాందిపలికి ఆహారోత్పత్తిని పెంపొందించారన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్ ను వెలుగులోకి తెచ్చింది జగ్జీవన్ రామ్ అని టి.జి భరత్ తెలిపారు. ఇక ఈ ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీలపైన మునుపెన్నడూ లేని విధంగా దాడులు, దౌర్జన్యాలు జరిగాయన్నారు. ప్రజల సమస్యలు తీర్చేందుకు తాము రాజకీయాల్లోకి వచ్చామని.. రానున్న ఎన్నికల్లో గెలిచాక ప్రజాసంక్షేమం, అభివృద్ధి దిశగా ముందుకెళతామని భరత్ అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, దళిత సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.