కర్నూలు.. తండ్రికి గుడికట్టిన కుమారులు
1 min readపల్లెవెలుగువెబ్ : తమ కష్టసుఖాల్లో ఎప్పుడూ అండగా నిలిచిన నాన్న ఉన్నట్టుండి కానరాని లోకాలకు వెళ్లాడు. కానీ నాన్న స్మృతులను, జ్ఞాపకాలను పదిలం చేయాలనుకున్నారు. అందుకే తండ్రిపై అభిమానంతో ఆలయాన్ని కట్టించారు. దేవుడిగా భావిస్తూ నిత్యం పూజలు చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం మనేకుర్తి గ్రామంలో గత 10 ఏళ్ల క్రితం కురవ ఈరన్న అనే వ్యక్తి మృతి చెందారు. ఆయనకు భార్య, ఎనిమిది సంతానం. అందులో ఇద్దరు కూతుళ్లు, ఆరుగురు కుమారులు ఉన్నారు. ఈరన్నకు పిల్లలంటే ప్రాణం. పిల్లలను చిన్ననాటి నుంచి ఎంతో ప్రేమతో పెంచారు. అందరికి చక్కని సంబంధాలు చూసి పెళ్లిళ్లు కూడా చేశారు. అంతేకాదు ఈరన్న బతికి ఉండగానే తన ఆస్తిని మొత్తం ఆరుగురు కుమారులకు రాసి ఇచ్చాడు. 10 ఏళ్ల క్రితం ఈరన్న అనారోగ్యనికి గురై వారం రోజుల వ్యవధిలో మరణించారు. రోజు కబుర్లు చెబుతూ పిల్లలకు మంచి మాటలను విద్యాబుద్ధులను నేర్పే వారే తల్లిదండ్రులు… అయితే తల్లిదండ్రులను చనిపోయాక కొన్ని రోజులకు వాళ్లను మరిచిపోతుంటారు. కానీ ఈరన్న కుమారులు అందరిలా కాదు.. తండ్రి మృతిని జీర్ణించుకోలేక వాళ్ళ నాన్న గుర్తుగా తమ పొలంలోనే ఒక ఆలయాన్ని నిర్మించారు.