ఆంధ్రప్రదేశ్ కు క్రీడ రాజధానిగా కర్నూలు ఎదుగుతుంది…
1 min read– క్రీడల్లో రాణించాలంటే క్రీడాకారులు ఆరోగ్యం పై దృష్టి సారించాలి.
– ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా కర్నూలు లో క్రీడా పోటీలు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో కర్నూలు రాష్ట్రానికి క్రీడా రాజధానిగా ఎదుగుతుందని ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. కర్నూల్ నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో ఈనెల 29న జరగనున్న జాతీయ క్రీడా దినోత్సవంను పురస్కరించుకొని ఏర్పాటుచేసిన కబాడీ పోటీలను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నుండి 40 జట్లు ఈ కబాడీ పోటీల్లో పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా పోటీల్లో పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకొని డాక్టర్ శంకర్ శర్మ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ జాతీయ క్రీడా దినోత్సవంను పురస్కరించుకొని నగరంలో ఏర్పాటు చేసిన కబాడీ పోటీల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి 40 చెట్లు పాల్గొనడం అభినందనీయమని చెప్పారు. మిగతా క్రీడలతో పోలిస్తే కబాడీ మన దేశ సంప్రదాయ క్రీడ అని ,ఎక్కడ కబాడీ పోటీలు జరిగిన మన దేశం ప్రతిభ కనబరచడం ఇందుకు నిదర్శనమని చెప్పారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వల్ల ఏకాగ్రత, దేహదారుద్యం పెంపొందుతుందని వివరించారు. విద్యార్థులు క్రీడల్లో రాణించడానికి వీలుగా ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం వాతావరణంలో మార్పుల నేపద్యంలో క్రీడాకారులు డీహైడ్రేషన్ కు గురి కాకుండా ద్రవపదార్థాలు ఎక్కువ తీసుకోవాలని కోరారు. క్రీడాకారులు గెలుపు ఓటమిలను సమానంగా తీసుకుని క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇంత పెద్ద స్థాయిలో క్రీడలను నిర్వహిస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 విజయవంతంగా చంద్రునిపై ల్యాండ్ కావడం ద్వారా మన దేశ ప్రతిష్ట ప్రపంచ దేశాల్లో మరింత పెరిగిందని, క్రీడలలో కూడా మన దేశం ప్రపంచ దేశాల్లో పేరు తెచ్చుకోవాలని కోరారు. క్రీడాకారులు క్రమశిక్షణతో సాధన చేసి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించి, దేశానికి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి ఈనెల 29వ తేదీ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా బహుమతులను అందజేస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం నాయకులు కొండే పోగు సుంకన్న తదితరులు పాల్గొన్నారు.