జాతీయ రహదారుల భూసేకరణ, నిర్మాణ పనులను వేగవంతం చేయాలి
1 min read
అధికారులకు ఇంచార్జి కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి ఆదేశం
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : జిల్లాలో జాతీయ రహదారి నిర్మాణ పనులకు సంబంధించి భూసేకరణ, నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లో మంగళవారం జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణ, భూసేకరణ అంశాలపై అధికారులతో ఇంచార్జ్ కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ధాత్రిరెడ్డి మాట్లాడుతూ ఖమ్మం నుండి దేవరపల్లి 365 బిజి (గ్రీన్ ఫీల్డ్ హైవే) నకు సంబంధించి భూసేకరణ ద్వారా సేకరించిన భూములలో కొందరు రైతులకు చెల్లించినవలసిన పరిహారాన్ని వెంటనే చెల్లించి భూములను స్వాధీనం చేసుకోవాలని, నిర్మాణంలో భాగంగా హెచ్ టి విద్యుత్ లైన్ల షిఫ్టింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. పామర్రు-దిగమర్రు 165 జాతీయ రహదారి నిర్మాణంలో కైకలూరు మండలం గోనేపాడు, తదితర గ్రామాలలో భూసేకరణ పనులను సంబంధిత రైతులతో మాట్లాడి పూర్తి చేయాలన్నారు. జీలుగుమిల్లి- పట్టిసీమ వరకు నిర్మించే 365 బిబి జాతీయ రహదారికి సంబంధించి భూసేకరణ పనులు పూర్తి అయ్యాయని, రోడ్డు నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని రహదారి భవనాల శాఖాధికారులను ధాత్రిరెడ్డి ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, ఏలూరు, జంగారెడ్డిగూడెం ఆర్డీఓలు అచ్యుత్ అంబరీష్, రమణ, జాతీయ రహదారుల సంస్థ అధికారులు, రహదారులు, భవనాల శాఖ అధికారులు, ఆయా మండలాలకు చెందిన తహసీల్దార్లు,ప్రభృతులు పాల్గొన్నారు.
