చిచ్చు రేపుతున్న మల్యాల తిప్పల భూములు
1 min read– ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూమి..
– ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి..
– రెవిన్యూ అధికారులకు గ్రామస్తుల ఫిర్యాదు.
–రెండు వర్గాలు పోటాపోటీగా ఆందోళనలు.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ప్రభుత్వ భూములను రక్షించాల్సిన రెవెన్యూ అధికారులు మిన్నకుండి పోతున్నారు.. అక్రమార్కుల రాజకీయ పలుకుబడితో ఆక్రమణల వైపు అధికారులు కన్నెత్తి చూడడం లేదు.ఫలితంగా కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఆక్రమణలకు అడ్డుకట్ట వేసేందుకు ఒకరిద్దరు అధికారులు ముందుకు కదిలినా అక్రమార్కులు రాజకీయ పలుకుబడితో నిలువరిస్తున్నారు.నందికొట్కూరు మండలంలోని మల్యాల గ్రామము శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం నీటి మునకలో సర్వం ఆస్తులు కోల్పోయిన గ్రామము. దీనికి తోడు హాంద్రీ నీవా ఎత్తిపోతల పథకం కింద మళ్ళీ భూములను కోల్పోయారు. రెండు తెలుగు రాష్ట్రంలో హంద్రీనీవా మల్యాల ఎత్తిపోతల పథకం వలన ప్రాచుర్యం పొందిన గ్రామంలో రూ.కోట్ల విలువైన ప్రభుత్వభూమి అక్రమార్కుల ఆక్రమణకు గురవుతుందనే ఆరోపణలు ఉన్నాయి . గ్రామ సమీపంలోని గుట్టలపై సర్వే నెం 172 లో 246ఎకరాల 18 సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది. కొన్ని ఏళ్ల క్రితం ఈ గుట్టలపై ఉన్న పెద్ద పెద్ద బండ రాళ్లను 40 ఎంఎం కంకరగా మలచి గ్రామానికి చెందిన కొంత మంది పేదలు, దళితులు అమ్ముకుంటు ఉపాధి పొందేవారు.కాలక్రమేనా గుట్టలు కాస్త చదునుగా మారాయి.ఇదే అదునుగా అక్రమార్కులు భూ దందాకు తెరలేపారు. ఈ భూముల సమీపంలోనే హంద్రీనీవా కాలువ వస్తుందని తెలిసిన అక్రమార్కులు ఈ భూములపై కన్నేశారు. గుట్టలను సైతం కొల్లగొట్టారు. గుట్టలను చదును చేసేసి అక్రమాలకు తెరతీశారు. పేదల బినామీ పేర్లతో ఆక్రమించుకున్నట్లు సమాచారం. 136 ఎకరాల 25 సెంట్లు ఆక్రమణలకు గురైనట్లు సమాచారం. ఇందులో మల్యాల గ్రామానికి చెందినవారు మాత్రమే కాకుండా నందికొట్కూరు మండలంలోని శాతనకోట, అల్లూరు, నందికొట్కూరు,గ్రామాలకు చెందిన ఎస్సి, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన పేదల బినామీ పేర్లతో రాజకీయ పలుకుబడి ఉన్న కొందరు ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని పాసు పుస్తకాలు సైతం సృష్టించుకున్నట్లు పలువురు ప్రజాసంఘాల నాయకులు, పేద మధ్యతరగతిప్రజలు ఆరోపిస్తున్నారు . అలాగే మరో 60.21సెంట్లకు అసైన్డ్ పట్టాలు గతంలో ఇక్కడ పనిచేసిన కొందరు అధికారులు ఇచ్చినట్లుగా ఆరోపణలున్నాయి. ఒక్కోక్కరు 2 ఎకరాల నుండి5 ఎకరాల వరకు అక్రమించుకున్నట్లు తెలుస్తుంది, అయితే గ్రామానికి చెందిన దళితులకు ఒక్కరికి కూడా ఒక్క సెంట్ భూమి కుడా అధికారులు పంచకపోవడం విశేషం , అయితే ఈ భూములు ఇప్పటికే అక్రమార్కుల పేరుతో ఆన్ లైన్లో నమోదు కావడం విశేషం.సరైన ధ్రువీకరణ పత్రాలు లేని కొందరివి మాత్రమే ఆన్ లైన్ ఆడంగల్ లోఎక్కడం లేదని సమాచారం. అక్రమార్కులు పొలాలను సాగు చేసుకుంటున్న ప్రశ్నించే వారిలేరు. 2018లో ప్రభుత్వం ఇక్కడ సూక్ష్మచిన్నమధ్యతరహ పరిశ్రమ కొరకు భూములను కేటాయించడంతో భూఆక్రమణల అసలు విషయం బయటకు వచ్చింది.ఏపీఐఐసీ వారు పరిశ్రమఏర్పాటు కోసం ప్రభుత్వానికి దరకాస్తు చేసుకోగా,కలెక్టర్ అదేశాలతో అప్పటి తహశీల్దార్ పరిశ్రమ ఏర్పాటు కు 25 ఎకరాల భూమిని కేటాయించడానికి సర్వేలు జరిపారు.ఈ సర్వేను అప్పట్లో రాజకీయ పార్టీల నాయకులు కుట్రలకు గ్రామస్తులు అడ్డుకోవడం జరిగిందనే విమర్శలు వచ్చాయి .పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్న పంట పొలాలకు తీవ్ర నష్టం జరుగుతుందని గ్రామస్తులు సర్వే అధికారులను అడ్డుకోవడం జరిగింది . అప్పట్లో ఈ సంఘటన జిల్లాస్థాయిలో చర్చనీయాంశమయ్యింది. తమ భూములను కాపాడుకోలేమని అక్రమార్కులే గ్రామస్తులను పురిగొల్పినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. పరిశ్రమ రాకుండా రాజకీయ పార్టీకి చెందిన వారు సైతం చక్రం తిప్పుతున్నారని గ్రామంలోని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటు తో ఉద్యోగాలు పొందవచ్చని నిరుద్యోగులు అభిప్రాయ పడుతున్నారు. వాస్తవానికి ఇక్కడి భూముల కోసం గతంలో కొంత మంది దళితులు దరకాస్తులు చేసుకున్నారని,అయితే వాటిని అధికారులు తిరస్కరించినారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన పేదలకు దళితులకు ఇక్కడి భూములు ఇద్దామని ఆలోచన కూడా ప్రభుత్వ అధికారులకు రాకపోవడంలో మర్మమేమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు అక్రమార్కులపై చర్యలకు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి . అధికారులపై రాజకీయ వత్తిళ్లు రావడంతో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తో ఫలితంగా కోట్ల రూ.ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని వామపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు .గత 20 ఏళ్లుగా జీవనాధారం కోసం గుట్టలను నమ్ముకొని జీవిస్తున్న పేదలకే భూముల పై హక్కులు ఉంటాయి.వారికే భూములను పంపిణీ చేయాలని ప్రజా సంఘాల ప్రతినిధులు అభిప్రాయ పడుతున్నారు. ఏదిఏమైనా ప్రభుత్వభూములను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వఅధికారులపైన ఉందనేది వారి వాదన.
హంద్రీనీవా ఫేజ్ 2 తో మళ్ళీ తెరపైకి ..ప్రభుత్వం హంద్రీనీవా ఫేజ్ 2 నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 172 సర్వే మళ్ళీ తెరపైకి వచ్చింది. ఇక్కడి ప్రభుత్వ భూములపై కొంతమంది రాజకీయ నాయకుల కన్ను పడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూముల వివరాలను ఆరా తీస్తున్నట్లు గ్రామాలలో ప్రజలు చర్చించుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భూముల వివరాలకు అధికారులపైనా వత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.దీనితో గతంలో 172 సర్వే లో అక్రమంగా ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న అక్రమార్కులు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.
గ్రామంలో చిచ్చు రేపుతున్న తిప్పలు..మల్యాల తిప్పలు భూముల వ్యవహారం గ్రామంలోని రెండు రాజకీయ పార్టీల మద్య రాజకీయ చిచ్చు రేపుతోంది. తిప్పలు చదును చేసుకుని సాగు చేసుకుంటున్నారని రెండు రోజుల కిందట కొందరు టీడీపీ నేతలు రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలే గ్రామ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని అక్రమంగా తిప్పలను ఇతరులకు విక్రయిస్తున్నారంటూ వైసీపీ మరో వర్గం వారు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ కార్యాలయంలో ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ భూముల వ్యవహారం గ్రామములో రెండు వర్గాలు ఒకరిపై మరొకరు గుర్రుగా ఉన్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. దీనితో గ్రామంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో నాని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఎలాంటి జీవనాధారం లేని పేదలకు తిప్పల భూములను అధికారులు పంపిణీ చేయాలని ,వాటిని సాగు చేసుకుంటు ఆర్థికంగా అభివృద్ధి చెందుతామని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సమస్యను సానుకూలంగా పరిష్కరించి గ్రామంలో ఎలాంటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అర్హులైన పేదలకు పంపిణీ చేయాలి…గ్రామస్తులు.ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా అధికారులే అడ్డుకోవాలి .సెంట్ భూమికుడా లేని నిరుపేద అర్హులైన పేదలను గుర్తించి ప్రభుత్వ భూమిని అధికారులు పంపిణీ చేయాలన్నారు. గ్రామంలో భూమి లేని పేదలు చాలామంది ఉన్నారు. హంద్రీనీవా,శ్రీశైలం ప్రాజెక్టుల నిర్మాణంలో వ్యవసాయ భూములను కోల్పోయి గ్రామస్తులు తీవ్రంగా నష్టపోయినారని అలాంటి వారికి న్యాయం చేయాలని గ్రామానికి చెందిన కురువ సుంకన్న, వడ్డే రమణయ్య, మద్దిలేటి, లింగస్వామి, శివ, షఫీ, అంకాలమ్మ, చెన్నమ్మ, వసంతమ్మ, షెకూన్ బీ, మహేశ్వరి, నాగమణి, వెంకటేశ్వర్లు , లక్ష్మీదేవి, లు కోరుతున్నారు.
అక్రమ ణలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తాము..తహశీల్దార్ రాజశేఖర్ బాబు..ప్రభుత్వ భూములను అక్రమించుకోవాలని చూస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ రాజశేఖర్ బాబు హెచ్చరించారు. మల్యాల తిప్పలు చదును కోసం ఉపయోగిస్తున్న యంత్రాలను సీజ్ చేస్తామని ,యజమానుల పైన కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రభుత్వ భూములను అక్రమించుకోడం చట్టరీత్యా నేరం. ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.