హైకోర్టును కర్నూలుకు తరలించాలని న్యాయవాదుల ధర్నా
1 min readపల్లెవెలుగు వెబ్: శ్రీభాగ్ ఒడంబడిక ప్రకారం హైకోర్టును కర్నూలులో పెట్టాలని డిమాండ్ చేస్తూ పత్తి కొండ న్యాయవాదులు రోడ్డు పైకి వచ్చి ధర్నా కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం స్థానిక నాలుగు స్తంభాల కూడలి వద్ద అమరావతి నుండి కర్నూలుకు హైకోర్టు ను తరలించాలని న్యాయవాదులు పెద్దఎత్తున రోడ్డుపై నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు సురేష్ కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రాజధాని నగరంగా ఉన్న కర్నూలుకు ఏ మాత్రం స్థానం లేకుండా ప్రభుత్వాలు పూర్తిగా అన్యాయం చేశాయని అన్నారు. ఈ మేరకు కర్నూలులో కనీసం హైకోర్టును పెట్టాలన్న శ్రీభాగ్ ఒడంబడికను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన అనంతరం కర్నూలుకు తీరని అన్యాయం చేశారని కనీసం హైకోర్టును అయినా కర్నూలులో పెట్టాలని డిమాండ్ చేశారు. పాలక పక్షాలు, ప్రతిపక్షాలు కలిసి శ్రీబాగ్ ఒడంబడికను అమలుచేయడం ద్వారా కర్నూలులో హైకోర్టు తరలింపు సాధ్యపడుతుందన్నారు. కర్నూలులో హైకోర్టు కోసం న్యాయవాదులు కడవరకు పోరాడుతామని స్పష్టం చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కర్నూల్ లో హైకోర్టును పెట్టడానికి బిల్లు తీసుకురావాలని అన్నారు. శ్రీభాగ్ ఒడంబడిక అమలు కోసం న్యాయవాదులు ఈ నెల 23 వరకు వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తామని చెప్పారు. దాదాపు అరగంట పాటు న్యాయవాదులు పెద్ద సంఖ్యలో రోడ్డుపై నినాదాలు చేస్తూ ధర్నా నిరసన కార్యక్రమాలు చేశారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మార్నేని మల్లికార్జున, సీనియర్ న్యాయవాదులు కారప్ప, అశోక్ కుమార్ చంద్రశేఖర్ ఎల్లారెడ్డి, మై రాముడు, సత్యనారాయణ, వీరన్న శ్రీభాగ్ ఒడంబడిక అమలు ద్వారా కర్నూలులో హైకోర్టు సాధన సాధ్యపడుతుందని తెలియజేశారు.