బాల్యవివాహ రహిత జిల్లాగా ఏలూరు జిల్లాను నిలుపుదాం..
1 min read– బాల్య వివాహాలు సమూలంగా నిర్మూలించడానికి కంకణ బద్దులు కావాలి..
– జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : బాల్య వివాహాలు నిర్మూలనకు సమాజంలోని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని జిల్లా జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ కోరారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో “బాల్య వివాహా రహిత భారతదేశం, బాలల భద్రతే భారత్ భద్రత ” నినాదంతో జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తొలుత ఏలూరు జిల్లావాసిగా భారత దేశాన్ని బాల్య వివాహ రహితంగా తయారుచేయడానికి బాల్య వివాహాల నిర్మూలనకు కట్టుబడి ఉంటామని అధికారులు, సిబ్బందితో జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ప్రతిజ్ఞ చేయించారు.అనంతరం బాల్య వివాహాల నిరోధంపై అవగాహన కలిగించే ర్యాలీని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ బాల్య వివాహాలను సమూలంగా నిర్మూలించడానికి ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు. బాల్య వివాహాలు నిరోధించడానికి మనమంతా కృషి చేయాలన్నారు. బాల్య వివాహాల వలన బాలిక, ఆమె పిల్లల జీవితం, భవిష్యత్తుపై తీవ్రమైన పరిమాణాలను కలిగిస్తుందన్నారు. బాల్య వివాహాలు నివారించేందుకు గ్రామస్థాయి నుండి కలిసికట్టుగా పని చేయాలన్నారు. బాల్య వివాహం చేయడానికి సన్నద్ధం అవుతున్నారని తెలిస్తే ముందుగా వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. బాల్య వివాహం వలన పిల్లలపై ఎటువంటి దుష్పరిణామాలు ఏర్పడతాయో విశదీకరించాలన్నారు. అలాగే బాల్య వివాహం చట్టరీత్యా నేరం అని, ఇందుకు రెండు సంవత్సరాలు జైలు శిక్ష, ఒక లక్ష రూపాయలు జరిమానా విధించబడుతుందనీ తెలియ చెప్పాలన్నారు. బాల్య వివాహంపై సమాచారాన్ని 112 లేదా చైల్డ్ లైన్ 1098 నెంబరుకు తెలియజేయాలన్నారు. ఎక్కడ ఒక్క బాల్య వివాహం కేసు కూడా నమోదు అవ్వకూడదన్నదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమన్నారు. ఎక్కడ కూడా బాల్య వివాహాలు జరగకుండా, అనుమానం ఉన్న చోట ముందుగానే అప్రమత్తం చేసి బాల్య వివాహ రహిత రాష్ట్రం, దేశంగా తీర్చిదిద్దుటకు మన వంతు భాధ్యతగా కృషి చేద్దామన్నారు. కార్యక్రమంలో ఏలూరు డిఎస్పీ శ్రీనివాసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ పిడి పద్మావతి , డిసిపిఓ సూర్యచక్రవేణి, జెడ్పి సిఇఓ కె. రవికుమార్, ఆర్డిఓ ఎన్.ఎస్.కె. ఖాజావలి,జిల్లా పంచాయితీ అధికారి టి. శ్రీనివాస్ విశ్వనాధ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జివివి సత్యనారాయణ, సూర్యనారాయణరెడ్డి, జిఎస్ డబ్ల్యూఎస్ నోడల్ ఆఫీసరు రమణ, ఎపిఇపిడిసిఎల్ ఎస్ ఇ పి. సాల్మన్ రాజు, సోషల్ వెల్ఫేర్ జెడి వి జయప్రకాష్ వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.