PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీమను కాపాడుకుందాం.. : బైరెడ్డి రాజశేఖర్​ రెడ్డి

1 min read

సీమ ద్రోహులకు గుణ పాఠం నేర్పుదాం..

ముఖ్యమంత్రులు సీమకు ఏమి చేశారో చెప్పాలి..

సీమలో కట్టిన ప్రాజెక్టులు చిల్లర ప్రాజెక్టులు..

ఎత్తిపోతల మోటార్లు చెడిపోతే రిపేర్లు చేసే దిక్కు లేదు..

ఈ నెల 28న  ఛలో సిద్దేశ్వరం సంగమేశ్వరం

పల్లెవెలుగు వెబ్​, నందికొట్కూరు: నంద్యాల జిల్లా సంగమేశ్వరం వద్ద సోమశిల, సిద్దేశ్వరం  మధ్య కృష్ణా నదిపై రూ.1,200 కోట్లతో నిర్మిస్తున్న  ఐకానిక్ బ్రిడ్జికి బదులు కృష్ణా నదిపై బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మించాలని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి కేంద్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. నిత్యం వెనుకబడిన ప్రాంతానికి ‘ నీరు, నిధులు మరియు ఉద్యోగాలు’ మంజూరు చేయాలనే డిమాండ్‌పై ఆయన మాట్లడారు. దశాబ్దాలుగా అభివృద్ధి చెందకపోవడానికి వరుసగా వచ్చిన ప్రభుత్వాల సుదీర్ఘ ద్రోహమే కారణమన్నారు. ఆదివారం నందికొట్కూరు లో ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ  ‘ ఛలో సిద్దేశ్వరం సంగమేశ్వరం’ కార్యక్రమంలో పాల్గొనాలని నియోజకవర్గంలోని  అన్ని రాజకీయ పార్టీలు, సామాజిక సంఘాలకు పిలుపునిచ్చారు.

ఐకాన్​ బ్రిడ్జి వద్దు.. బ్యారేజ్​ కమ్​ బ్రిడ్జి కావాలి..

రాయలసీమ గుండా అనేక నదులు ప్రవహిస్తున్నప్పటికీ, ఈ ప్రాంతం కొంతకాలంగా మంజూరు చేయబడిన చిన్న ప్రాజెక్టులతో సంతృప్తి చెందాల్సి వచ్చిందని  అన్నారు. సోమశిల, సిద్దేశ్వరం మధ్య  కృష్ణా నదిపై ఐకాన్ వంతెన నిర్మాణం వలన ఎవరికి లాభం లేదని అన్నారు. కృష్ణా నదిపై మాకు అందాల ఐకాన్‌ బ్రిడ్జి వద్దు. సీమ సాగు, తాగునీటి కష్టాలు తీర్చే బ్యారేజ్‌ కమ్‌ బ్రిడ్జి కావాలి.

సంక్రాంతి తరువాత వైసీపీ నేతల చేతుల్లో మరోసారి మోసపోకుండా సీమ జిల్లాల ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం. దీని కోసం స్టీరింగ్‌ కమిటీ ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని ప్రకటించారు.

కరువు నివారణకు.. కృష్ణా,తుంగ భద్ర నీరే కీలకం..:

రాయలసీమ కరువు శాశ్వత నివారణకు కృష్ణ,తుంగభద్ర నదుల నీరు కీలకమన్నారు.ఈ రెండు నదులు కలిచేచోటు సంగమేశ్వర సమీపంలో సిద్దేశ్వరం అన్నారు.అయితే కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా 167కి.మీ. జాతీయ రహదారిని అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ ను కలుపుతూ సిద్దేశ్వరం సంగేమేశ్వరం వద్ద తీగల వంతెన(ఐకాన్ బ్రిడ్జి) చేపడుతున్నదన్నారు.తీగల వంతెన(ఐకాన్ బ్రిడ్జి)బదులు బ్యారేజ్ తోపాటు వంతెనను కృష్ణానదిపై సిద్దేశ్వరం వద్ద నిర్మాణం చేపట్టితే సుమారు 70 టి.ఎం.సి ల నీరు నిలిచి అటు తెలంగాణకు,ఇటు రాయలసీమకు సాగు తాగు నీరు అందుతుందన్నారు.

28న ప్రజా ప్రదర్శన..:

ఉమ్మడి కర్నూలు జిల్లాలో కేసి కాలువ, ముచ్చుమర్రి ఎత్తిపోతల, హంద్రీనీవా , పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులకు సమృద్ధిగా సాగునీరు అందుతుందన్నారు.తీగల వంతెన నిర్మాణం కాకుండా బ్యారేజ్ తోపాటు వంతెన నిర్మాణం చేపట్టాలని కోరుతూ కేంద్రం, రెండు తెలుగు రాష్ట్రప్రభుత్వాలపై ఓత్తిడి పెంచేందుకు రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో  రాయలసీమ  జిల్లాల నుంచి ప్రజలు ఈ నెల 28 సిద్దేశ్వరం  వరకు ప్రజా ప్రదర్శన చేయాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు.పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గోని  రాయలసీమ  ప్రజా ప్రదర్శన విజయవంతం చేయాలని అన్నారు.సమావేశంలో మాజీ జడ్పీటిసి నాగేశ్వరరావు, బిజెవైఎం నందికొట్కూరు ఇంచార్జి నాగ మద్దిలేటి, బిజెపి నందికొట్కూరు పట్టణ అధ్యక్షుడు గూడూరు రవికుమార్ రెడ్డి, జూపాడుబంగ్లా బిజెవైఎం నాయకులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

About Author