PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చర్మ సౌందర్యం.. కాపాడుకుందాం.. !

1 min read

–          చర్మవ్యాధులపై అవగాహన అవసరం

–          డెర్మటాలజిస్ట్ డాక్టర్​.జి.బి.మేఘన

పల్లెవెలుగు, కర్నూలు: ఆధునిక ప్రపంచంలో స్వచ్ఛమైన గాలి, నీరు లభించడం కష్టసాధ్యం.  ఇంటి నుంచి బయటకు రాగానే.. వాతావరణ కాలుష్యంతో అవస్థలు ఎదుర్కొంటున్న ప్రజలు వివిధ రకాల చర్మ వ్యాధులకు లోనవుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరిలో చర్మ సమస్యలు పెరిగిపోతున్నాయి.  చర్మ వ్యాధుల రకాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ఉంటే చర్మ సౌందర్యం అలాగే ఉంటుందన్నారు కర్నూలు నగరం ఎన్​ఆర్​పేటలోని జీవీఆర్​ హాస్పిటల్​ డెర్మటాలజిస్ట్ మరియు కాస్మోటాలజిస్ట్ వైద్యులు డా. జి.బి. మేఘన ఎం.డి. డి.వి. ఎల్. ఆహారపు అలవాట్లు…తగిన వ్యాయామం చేస్తే..  ఆరోగ్యంతోపాటు చర్మ సౌందర్యాన్ని పదిలంగా ఉంచుకోవచ్చని సూచించారు.

చర్మ వ్యాధుల రకాలు :

మొటిమలు: చర్మ రంధ్రాలు మూసుకుపోవడం వల్ల మొటిమలు ఏర్పడతాయి. చర్మం యొక్క రకాన్ని బట్టి మొటిమలు వస్తుంటాయి.ఇవి ముఖంపై తిత్తులు లేదా గుంతలు లాగా వచ్చి నల్లమచ్చలు లేదా తెల్ల మచ్చలుగా కనబడుతుంటాయి. అయితే కొంతమందికి ముఖంపై మొటిమల సమస్య తగ్గినప్పుడు మచ్చలు రావడం ప్రారంభమవుతాయి. మొటిమలు తగ్గిన తర్వాత కూడా చాలా మంది ఎక్కువ కాలం పిగ్మెంటేషన్ మరియు మచ్చలను కలిగి ఉంటారు.  హార్మోన్లు, మందులు, పర్యావరణం, ఆహారపు అలవాట్లు, సౌందర్య సాధనాలు, వైద్య పరిస్థితులు మరియు జన్యుపరమైన మార్పులు కూడా మొటిమలకు కారణాలు కావచ్చు. వారసత్వంగా కూడా ఈ మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువ.

దద్దుర్లు: దద్దుర్లను వైద్య పరిభాషలో అర్టికేరియా అని పిలుస్తారు. దద్దుర్లు ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని ప్రభావితం చేస్తుంది. దద్దుర్లు చర్మంపై వాపు, దురద, చికాకును కలిగించడమే కాక చర్మంపై బొబ్బలు మరియు పొక్కులకు కూడా కారణం అవుతుంది. చాలా రకాల దద్దుర్లు కొన్ని రోజులు లేదా వారాల్లో వాటంతట అవే తగ్గిపోతాయి. అయితే  కొన్ని సందర్భాల్లో దురద 6 వారాల కంటే ఎక్కువ రోజులు గనుక ఉంటే, అది దీర్ఘకాలిక దురదగా చెప్పుకోవచ్చు.

ముఖ్యంగా శరీరంపై దద్దుర్లు తీసుకునే ఆహారం మరియు నీరు, మందు, చలి, అతినీలలోహిత కాంతి, చర్మంపై ఒత్తిడి, మొక్కలు, జంతువులు లేదా పలు రసాయనాలను తాకినప్పుడు కూడా కలుగుతాయి.

గజ్జి: గజ్జి అనే చర్మ వ్యాధిని స్కేబీస్ గా పిలుస్తారు. ఇది చిన్నగా ఉండే ఎనిమిది కాళ్ల మైట్ అనే పరాన్నజీవి వల్ల వస్తుంది. ఈ పరాన్నజీవి ఆహారం కోసం చర్మం పొరలోకి ప్రవేశించినప్పుడు గజ్జి అనే చర్మ వ్యాధి వస్తుంది. తీవ్రమైన దురదను కలిగి ఉండడం  గజ్జి యొక్క ప్రధాన లక్షణం. గజ్జి వ్యాధి చర్మం నుంచి చర్మానికి వ్యాప్తి చెందుతుంది.

పిల్లలు, చిన్న పిల్లల తల్లులు, లైంగికంగా చురుకుగా ఉండే యువకులు, హాస్టళ్లలో ఉండేవారికి మరియు ఆసుపత్రిలో చేరిన రోగులకు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

సోరియాసిస్‌: శరీరం చర్మ కణాలను చాలా వేగంగా తయారు చేసినప్పుడు ఈ పరిస్థితి వస్తుంది. దీని వలన చర్మ కణాలు పేరుకుపోయి చర్మం మందం అవడం, వాపు, దురద మరియు పొలుసులు ఊడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి వయస్సుతో సంబంధం లేకుండా ఏవరికైనా వస్తుంది. కొన్ని సార్లు శిశువులకు మరియు చిన్నపిల్లలలో కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది. ఇది అంటువ్యాధి కాదు మరియు ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందదు.

సోరియాసిస్ అనే చర్మ వ్యాధి చాలా రకాలుగా ఉంటుంది. చర్మంపై ఇది కనిపించే చోటు మరియు దాని లక్షణాలను బట్టి మారుతుంటుంది. ఈ పొలుసులు (స్కేల్స్) వెండి-తెలుపు పూతతో కప్పబడి ఉంటుంది.

బొల్లి: ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని ప్రభావితం చేస్తున్న చర్మ వ్యాధుల్లో బొల్లి కూడా ఒకటి. బొల్లి అనేది చర్మం యొక్క రంగును కోల్పోయే ఒక రకమైన చర్మ వ్యాధి. ఈ వ్యాధి సోకితే చర్మం తన సహజ రంగును కోల్పోతుంది. ఇది శరీరంలో ఏ భాగంలో నైనా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మచ్చలు కాలక్రమేణా పెరుగుతాయి. బొల్లి అంటు వ్యాధి కాదు మరియు ఒకరి నుంచి మరొకరి వ్యాప్తి చెందే అవకాశం లేదు.

తామర: తామర (రింగ్‌వార్మ్) అనేది డేర్మటోఫైట్‌ అని పిలువబడే ఒక రకమైన ఫంగస్‌ వల్ల వస్తుంది. ఇది దురద మరియు ఎర్రబడిన చర్మ పొక్కులతో కూడిన ఒక సాధారణ చర్మ సమస్య. ఇది అనేక రకాలుగా ఉంటుంది.

మెలస్మా: మెలస్మా అనేది ఒక సాధారణ చర్మ వ్యాధి. ముఖంపై చర్మం యొక్క రంగు సహజ రంగులో కాకుండా ముదురు రంగులో మారే పరిస్థితినే మెలస్మా అంటారు. ఇది ముఖంపై నల్ల మచ్చలాగా కనిపిస్తాయి. మెలస్మా ప్రధానంగా ముఖం మీద, బుగ్గలు, గడ్డం, నుదురు, ముక్కు, పై పెదవి పైన వస్తాయి. మెలస్మా కేసులు మహిళల్లో ఎక్కువగా

కనిపిస్తాయి. ఇది పురుషులలో కనిపించడం చాలా అరుదు. మెలస్మా మెలనిన్ యొక్క అధిక ఉత్పత్తి ద్వారా ప్రేరేపించబడుతుంది.

జాగ్రత్తలు ఇవి…

1.         సూర్యరశ్మిలో కొంత సమయం గడపాలి

రోజూ సూర్యరశ్మిలో కొంత సమయం గడపడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండి పొలుసులు రాకుండా ఉంటుంది. అయితే ఎక్కువ ఎండలో ఉండేవారు మాత్రం తప్పకుండా శరీరాన్ని కప్పి ఉంచే పొడవాటి దుస్తులు మరియు నెత్తిపైన పెద్ద టోపి వంటి వాటిని వాడాలి.

2.         చర్మాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచాలి

తగినంత మంచినీరు, పండ్లు, పండ్ల రసాలను తీసుకోవాలి. చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం వల్ల తగిన తేమ లభించి, చర్మ సమస్యలు దరి చేరవు. ఇందుకు మాయిశ్చరైజర్ వంటివి తప్పకుండా ఉపయోగించాలి. మరీ ముఖ్యంగా వేసవి కాలంలో సాధ్యమైనంత వరకూ చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచాలి. చర్మానికి తగిన తేమ లేకపోతే అనారోగ్యం కారణంగా అనేక చర్మ సమస్యలు వెంటాడుతాయి.

3.         కాలుష్యం బారిన పడకుండ చూసుకోవాలి

వాతావరణ కాలుష్యం, దుమ్ము, ధూళి, పొగ ఇలా రకరకాల కారణాల వల్ల కూడా అనేక చర్మ సమస్యలు వస్తాయి. కలుషిత ప్రాంతాల్లో ఎక్కువగా సంచరించరాదు. ఒక వేళ తిరిగిన చర్మాన్ని వీలైనంత త్వరగా శుభ్రం చేసుకోవడం మంచిది.

4.         స్నాన సమయాన్ని తగినంతగా పరిమితం చేసుకోవాలి. గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి.

స్నానం చేసే సమయాన్ని నిర్దేశించుకోవాలి. స్నానం చేసేటప్పుడు సాధారణ సబ్బుకు బదులు గ్లిజరిన్‌ లేక సిండేట్ సబ్బులు వాడటం ఉత్తమం. సబ్బు పూర్తిగా పోయే వరకు స్నానం చేయాలి.

5.         మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి

వివిధ రకాల పని బత్తిడిలకు గురి కాకుండా ఉండాలి. అంతేకాక ధూమపానం, మద్యపానం, వంటివి చేయకూడదు.

చర్మ వ్యాధులు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ఆహారం:

చాలా మంది సమతుల్య ఆహారం తీసుకోకపోవడం మరియు పోషకాహార లోపం కారణంగా అనేక రకాల చర్మవ్యాధుల బారిన పడుతుంటారు. అయితే తరచుగా చర్మ వ్యాధులతో బాధపడేవారు కొన్ని సాధారణ పద్దతులను పాటించడం ద్వారా కొంత ఉపశమనం పొందవచ్చు.

•          తగినంత నీటినితీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండడమే కాక చర్మం కూడా మెరుస్తూ ఉంటుంది.

•          క్యారెట్‌లను తీసుకోవడం వల్ల ఇందులో ఉండే విటమిన్‌-ఎ చర్మం పొడి బారకుండా తేమగా ఉండేలా చేస్తుంది.

•          విటమిన్-సి ఎక్కువగా ఉండే నారింజ, స్ట్రాబెర్రీలు, యాపిల్స్, పుచ్చకాయ, అరటిపండు, బొప్పాయి వంటి వాటిని తీసుకోవాలి.

•          గ్రీన్ టీ మరియు సాల్మన్‌ చేపల్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్‌ మరియు ఫ్యాటీ యాసిడ్లు అధిక మొత్తంలో ఉండడం వల్ల ఇవి కూడా చర్మ సంరక్షణకు తోడ్పడతాయి.

About Author