PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కిడ్నీలను.. కాపాడుకుందాం.. : డా.సాయివాణి

1 min read

సరైన..ముందు జాగ్రత్త చికిత్సతో మూత్రపిండాల వ్యాధులను నియంత్రించవచ్చు

  • నెఫ్రాలజి డాక్టర్​ సాయివాణి

కర్నూలు:దేశంలో ప్రతి ఏడుగురిలో ఒకరు మూత్రపిండాల వ్యాధితో బాధ పడుతున్నారని, గత రెండు దశాబ్దాలుగా కిడ్నీ సంబంధిత రోగులు అధికమయ్యారని, సరైన.. ముందు జాగ్రత్త చికిత్సలతో కిడ్నీ వ్యాధులను నియంత్రించుకోవచ్చన్నారు ప్రముఖ నెఫ్రాలజి వైద్య నిపుణురాలు డాక్టర్​ యల్లంపల్లి సాయివాణి. కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​ కార్యదర్శి,  ప్రముఖ గుండె వైద్య నిపుణులు డా. చంద్రశేఖర్​ నేతృత్వంలో ఆదివారం హార్ట్​ ఫౌండేషన్​ ఛాంబరులో డా. సాయివాణి కిడ్నీ వ్యాధి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యవిద్యార్థులకు అవగాహన కల్పించారు.  కిడ్నీ సమస్యలకు ముఖ్య కారణం అదుపులో లేని మధుమేహం. అది కాక, అధిక రక్తపోటు, కొన్ని సార్లు బీ.పీ తగ్గిపోవడం వల్ల, ఎన్నో ఇతర ఇన్ఫెక్షన్లు ( డెంగూ, మలేరియా, హెచ్‌ఐవీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు), మూత్ర పిండాల రాళ్లు, కొన్ని రకాల మందుల (నొప్పి తగ్గడానికి వాడే మాత్రలు, స్టెరాయిడ్ మాత్రలు, కొన్ని యాంటీబయాటిక్స్) వల్ల ఈ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా, మోతాదు తెలియని వాళ్లు ఇచ్చే పసరు మందులు, చెట్ల మందుల వల్ల, కొన్ని సార్లు జన్యు పరమైన సమస్యల కారణంగా, లూపస్ (SLE) వంటి కొన్ని స్వయం ప్రతిరక్షక వ్యాధులు (మహిళల్లో అధికంగా) మూత్ర పిండాలు పాడవడానికి కారణం అవ్వవచ్చును.

కిడ్నీ వ్యాధి…లక్షణాలు:

లక్షణాలు అనేవి మొదట వ్యాధికి కారణాన్ని బట్టి ఉండవచ్చును. దీర్ఘ కాలిక జబ్బుల వల్ల మూత్ర పిండాలు పాడై ఉంటే.. ముందుగా మొహం వాపు, తరవాత కాళ్లు, శరీరం అంతా వాపు రావొచ్చు. మూత్రం సరిగ్గా రాకపోవడం, నడిస్తే ఆయాసం, పడుకుంటే ఆయాసం రావడం సాధారణంగా ఉంటాయి. ఒకవేళ మూత్ర పిండాలలో రాళ్లు ఉంటే ..నడుములో నొప్పి, అక్కడి నుంచి గజ్జల్లోకి రావడం, చలి జ్వరం, మూత్రంలో మంట వంటి లక్షణాలతో ప్రారంభం అవ్వచ్చు. ఇతర ఏవైనా ఇన్ఫెక్షన్ల వల్ల మూత్ర పిండాలు పాడై ఉంటే వాటికి సంబంధించిన వ్యాధి లక్షణాలు తెలియకపోతే… దగ్గరలోని నెఫ్రాలజి వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.

పర్యవసానాలు ఎలా ఉంటాయి:

ఒంట్లో రక్త కణాలు తయారవ్వడానికి అవసరమైన ఒక ముఖ్యమైన హార్మోన్ (ఎరిథ్రోపోయిటిన్) మూత్ర పిండాలలో ఉత్పత్తి అవుతుంది. అందుకే మూత్ర పిండాలు పాడైన వారికి హీమోగ్లోబిన్ తగ్గిపోతుంది. దానితో రక్తహీనత, ఆయాసం, నీరసం, అలసట వంటి లక్షణాలు కలగవచ్చు. అలాగే మన శరీరంలోని కండరాలు, ఎముకలు బలంగా ఉండటానికి ఎంతో అవసరమైన విటమిన్ డి మొదలగునవి మూత్రపిండాలలో ఉత్పత్తి అవుతాయి. అందుకే విటమిన్ డి తగ్గిపోవడం వల్ల కలిగే నీరసం, ఒళ్లు నొప్పులు అలసట వంటివి మూత్ర పిండాల వ్యాధిగ్రస్తుల్లో సర్వ సాధారణం. మూత్రపిండాలు మన రక్తపోటును నియంత్రించే ముఖ్యమైన అవయవాలు. కాబట్టి, మూత్రపిండాల సమస్య ఉన్న వాళ్లకు రక్తపోటు అదుపులో ఉండకపోయే ప్రమాదం ఉంది. అధిక శాతం వారు అనేక రకాల మందులు వాడవలసిన అవసరం ఉంటుంది. అయినా అప్పుడప్పుడు బీపీ హెచ్చు తగ్గులతో ఇబ్బంది పడే అవకాశం ఉంది.

కిడ్నీ‌లను కాపాడుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు

*ఆహారంలో ఉప్పు తక్కువ తీసుకోవాలి.

*అధికంగా మాంసం తీసుకోకూడదు.

*ప్రతి రోజు కనీసం ముప్పై నిమిషాలు వ్యాయామం చేయాలి

*ఆహారంలో సగభాగం పీచు పదార్ధాలు ఉండేలా చూసుకోవాలి.

*ధూమపానం మానేయాలి.

*నొప్పి గోళీలు, అనవసరంగా స్టెరాయిడ్స్ వాడకూడదు.

*రక్త పోటు, మధుమేహం ఉన్న వారు తరుచూ పరీక్ష చేసుకుంటూ, సరైన వైద్యుల నుంచి మందులు వాడాలి.

*రక్త హీనత, నీరసం, ఒళ్లు నొప్పులు, వంటి సమస్యలు ఉంటే వెంటనే వైద్యుల సలహా మీద పరీక్షలు చేయించుకోవాలి.

* తాగునీరు అధికంగా తీసుకోవాలి.

About Author