నియోజకవర్గ అభివృద్ధికి రాజకీయాలకతీతంగా కృషి చేద్దాం
1 min read– పి.రామచంద్రయ్య
– ఘనంగా చదువుల రామయ్య వర్ధంతి వేడుకలు
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి రాజకీయాలకతీతంగా కృషి చేద్దామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.రామచంద్రయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో కామ్రేడ్ చదువుల రామయ్య 31 వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా నాయకులు చదువుల రామయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పత్తికొండ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిపై సిపిఐ మండల కార్యదర్శి డి.రాజాసాహెబ్ అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.రామచంద్రయ్య, శాలివాహన మాజీ కార్పొరేషన్ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర తెలుగుదేశం పార్టీ బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శి రామానాయుడు, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుపాల్, సిపిఎం మండల కార్యదర్శి రంగారెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నబి రసూల్, హాజరై మాట్లాడారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పత్తికొండ నియోజకవర్గం అభివృద్ధికి, భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తికై కామ్రేడ్ చదువుల రామయ్య చేసిన సేవలను వారు కొనియాడారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.రామచంద్రయ్య మాట్లాడుతూ పాలక ప్రభుత్వాలు ఎన్ని మారినా పత్తికొండ నియోజకవర్గం ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. కమ్యూనిస్టు పార్టీల సుదీర్ఘ పోరాట ఫలితమే హంద్రీ నీవా కాలువను సాధించడం జరిగిందని గుర్తు చేశారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే సాగు, త్రాగునీరు మరియు పరిశ్రమలు అవసరమని, వీటి సాధన కొరకు రాజకీయాలకతీతంగా ఉద్యమాలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. జిల్లాలో వెనుకబడ్డ పత్తికొండ నియోజకవర్గం లో రైతులు టమోటా పంటను ఎక్కువగా సాగు చేస్తారని, సహకార పరపతి సంఘాల ద్వారా టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకుందామని తెలిపారు. జిల్లాలోని 106 చెరువులకు నీళ్లు నింపుతామని అధికార, ప్రతిపక్ష పార్టీలు హామీలు ఇచ్చి కాలయాపన చేస్తున్నారు తప్ప, ఏ ఒక్క చెరువుకి నీరు నింపింది లేదన్నారు. కర్ణాటక రాష్ట్రంలో అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి పూర్తి చేస్తే, రాయలసీమ ప్రాంతవాసుల కు నీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి దాపురుస్తుందని, రాయలసీమ ప్రాంత ప్రజలు మనకు రావలసిన నీటి వాటాను సాధించుకునేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యమాలను ఉదృతం చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు కేటాయించి తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మద్దిలశెట్టి సిపిఐ తుగ్గలి మండల కార్యదర్శి సుల్తాన్, మద్దికేర మండల కార్యదర్శి నాగరాజు, పత్తికొండ పట్టణ కార్యదర్శి ఎన్.రామాంజనేయులు, సిపిఎం సీనియర్ నాయకులు వెంకటేశ్వర్లు, సిఐటియు నాయకులు దస్తగిరి, కాశీనాథ్,సిపిఐ ప్రజాసంఘాల నాయకులు గురుదాస్, తిమ్మయ్య అనుమప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకట్రాముడు, నాగరాజు, తిమ్మ గురుడు, కారుమంచి, పెద్ద ఈరన్న, కృష్ణయ్య, రంగన్న, నెట్టికంటయ్య, జోలపురం కాశి, రాజప్ప, మాదన్న, గుండు బాషా, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.