మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం… టి.జి భరత్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడినే పూజించాలని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. టిజిబి యూత్ ఆధ్వర్యంలో నగరంలోని సంకల్ భాగ్ వెంకటేశ్వర స్వామి ఆలయం, కొత్త పేట ఆంజనేయస్వామి ఆలయం, ప్రకాష్ నగర్ వినాయక స్వామి ఆలయం, కారల్ మార్క్స్ నగర్, అశోక్ నగర్, వెంకట రమణ కాలనీ, ఇందిరాగాంధీ నగర్, గాంధీ నగర్, బుధవారపేట, ఏ క్యాంప్, మద్దూర్ నగర్ తో పాటు ఇతర కాలనీల్లో మొత్తం 7200 మట్టి వినాయకుని విగ్రహాలు ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం టి.జి భరత్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరి గానే ఈ ఏడాది కూడా టిజిబి యూత్ అసోసియేషన్ తరుపున మట్టి వినాయకుని విగ్రహాలు ప్రజలకు ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం అందరం కలిసి కట్టుగా ఉండాలన్నారు. రాష్ట్రంలో కర్నూల్లోనే వినాయక చవితి వైభవంగా జరుగుతుందన్నారు. అందుకే పర్యావరణ పరిరక్షణ కోసం ఇక్కడి నుంచే అందరూ క్రుషి చేయాలన్నారు. తమ వంతుగా మట్టి వినాయకుని విగ్రహాలు ప్రజలకు అందించి ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలు నగరమంతా మట్టి విగ్రహాలు ఏర్పాటుచేసేలా చేస్తామన్నారు. తుంగభద్ర, కెసి కెనాల్ లో కావాల్సినంత నీరు లేదని.. నిమజ్జనం చేయాలంటేనే ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందన్నారు. గతంలోనే తాను అధికారులను పత్రికా పరంగా విజ్నప్తి చేసినట్లు గుర్తు చేశారు. నిమజ్జనం రోజు కంతా ప్రజలకు ఇబ్బందులు లేకుండా నీరు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని భరత్ కోరారు. కర్నూలు నగరమంటే మట్టి విగ్రహాలు గుర్తొచ్చేలా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, భక్తులు పాల్గొన్నారు.