PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘లివర్​’.. సురక్షితమేనా..!

1 min read

జీర్ణ వ్యవస్థలో లివర్​ పాత్ర కీలకం..

  • నిద్రలేమీ..అలసట.. కామెర్లు ఉంటే …లివర్​ సమస్య ఉన్నట్టే…
  • జంక్​ఫుడ్​,ఆల్కహాల్​తో..తీవ్రంగా దెబ్బతింటున్న ‘లివర్​’
  • సరైన జీవనశైలితో.. ఆరోగ్యం పదిలం..
  •  డాక్టర్​ కె.నవీన్​ కుమార్​
  • గ్యాస్ర్టో ఎంట్రాలజిస్ట్​ అండ్​ హెపటాలజిస్ట్​ కిమ్స్​ హాస్పిటల్​ , కర్నూలు

మనిషి జీవనశైలిలో విపరీతమైన మార్పులు రావడంతో చిన్నా… పెద్దా.. అనే తేడా లేకుండా ప్రతిఒక్కరికీ ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. జంక్​ఫుడ్​, అవుట్​సైడ్​ ఫుడ్​కు అలవాటు పడిన వారు ‘లివర్’ సమస్యలు ఎదుర్కొంటున్నారు.  శరీరంలో ‘లివర్’ సురక్షితంగా ఉంటేనే… ఆరోగ్యంగా ఉంటారని, ఇందుకు ఆహారపు అలవాట్లలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు కర్నూలు కిమ్స్​ ఆస్పత్రి ప్రముఖ గ్యాస్ర్టో ఎంట్రాలజిస్ట్​ అండ్​ హెపటాలజిస్ట్​ డా. కె.నవీన్​ కుమార్​.

పల్లెవెలుగు, కర్నూలు:మనిషికి గుండె..ఊపిరితిత్తులు..కిడ్నీ.. ఎంత ప్రధానమో… లివర్​ కూడా అంతే కీలకం. చాలా మందికి లివర్​ పని చేసే విధానం, లివర్​ సమస్య కారణంగా ప్రాణహాని ఉందనేది తెలియడంలేదు. నాలుక రుచి కోసం ఫాస్ట్​ ఫుడ్​, చికెన్​ , మటన్​ బిర్యాని… ఇష్టమొచ్చినట్లు తింటూ… ఆల్కహాల్​ తాగుతూ… ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే ప్రతి రోజు వ్యాయామంతోపాటు సరైన పోషక ఆహారం తీసుకోవాలని ప్రముఖ గ్యాస్ర్టో ఎంట్రాలజిస్ట్​ డా.కె.పవీన్​ కుమార్​ సూచించారు. ‘లివర్​’ సమస్యలు రాకూడదంటే.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన మాటల్లో…

బలహీనత.. కామెర్లు ఉంటే…

లివర్‌‌ బలహీనంగా ఉంటే, మీ శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. బలహీనత, ఆకలి లేకపోవడం, వాంతులు, నిద్రలేమి, రోజంతా అలసటగా అనిపించడం, నీరసం, వేగంగా బరువు తగ్గడం,కామెర్లు రావడం, రక్త వాంతులు, మల విసర్జన నల్లగా ఉండటం, బరువు తగ్గడం, కాళ్లు, కడుపులో నీరు చేరితే లివర్‌‌ సమస్య ఉందని గుర్తించాలి. బీపీ,షుగర్​ ఉన్న వారికి లివర్​ సమస్య తప్పనిసరిగా  ఉంటుంది.

జీర్ణ వ్యవస్థలో..లివర్​ పాత్ర..

మనిషి శరీరంలో లివర్‌ 500 పైగా పనులు నిర్వహిస్తుంది.  జీర్ణకోశ నాళం నుంచి వచ్చే రక్తాన్ని లివర్‌ ఫిల్టర్‌ చేస్తుంది. మనం తీసుకున్న ఆహారం జీర్ణం చేయడానికి కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది. మనం తీసుకున్న ఆహారంలోని వ్యర్థాలను, విషతుల్యాల ను సైతం లివర్‌ తొలగిస్తుంది. మన శరీరంలో ఏర్పడే ఇన్ఫెక్షన్లు, కొవ్వులు, రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా లివర్‌ నియంత్రి స్తుంది. మన జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి లివర్‌ కీలకం. ముఖ్యమైన హార్మోన్లను, ఎంజైమ్‌లను లివర్ తయారు చేస్తుంది. మన శరీరంలో కీలక అవయవమైన కాలేయం ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. నిజానికి, లివర్‌ సమస్యలను గుర్తించడం కష్టమే. చాలా వరకు 90 శాతం కాలేయం దెబ్బతినేంతవరకు వ్యాధి లక్షణాలు బయటప‌డ‌వు. అయితే, లివర్‌ సమస్యలు ఉంటే.. కొన్ని సందర్భాల్లో లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి.

కడుపులో వికారం.. ఉంటే..

సాధారణంగా కడుపులో అసౌకర్యం ఉంటే వికారంగా, వాంతి వచ్చేలా ఉంటుంది. కొన్ని సార్లు వాంతులు కూడా అవుతూ ఉంటాయి. చాలా మంది ఇది కడుపులో అసౌకర్యంగా భావించి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ, ఈ సమస్య పదేపదే ఇబ్బంది పెడుతుంటే.. మీ లివర్‌లో సమస్య ఉందని అనుమానించాల్సిందే. మీరు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవలసి ఉంటుంది.

నోటి దుర్వాసన..

నోటి పరిశుభ్రత సరిగా పాటించకపోవడం వల్ల నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. అయితే ఒక్కోసారి కాలేయంలో సమస్యలు వచ్చినా నోటి నుంచి దుర్వాసన రావడం మొదలవుతుంది. మీరు నోటి శుభ్రత పాటించినా.. దుర్వాసన సమస్య ఉంటే డాక్టర్‌ను కలవడం మంచిది.

కళ్లు పసుపు పచ్చగా మారితే..

కొన్ని వ్యాధుల లక్షణాలు కళ్ల ద్వారానే గుర్తిస్తారు! దీనికి మంచి ఉదాహరణ కామెర్లు, హెపటైటిస్. ఈ సమస్యలు ఉంటే.. కళ్లు పసుపు పచ్చగా మారతాయి. ఒకవేళ.. మీరు నిద్ర లేవగానే కళ్ల రంగు పసుపు రంగులోకి మారితే.. లివర్‌ ప్రాబ్లమ్‌ ఉన్నట్లు అనుమానించాల్సిందే.

మూత్రం రంగు మారితే..

మూత్రం రంగులో మార్పు వచ్చినా.. కిడ్నీ, లివర్‌లో సమస్యలున్నట్లు భావించాలి. ముఖ్యంగా శరీరంలోని మలినాలను తొలగించే కాలేయం సరిగా పనిచేయకపోతే పిత్త రసం, లవణాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఇవి శరీరంలో పేరుకుపోయి, చివరికి మూత్రవిసర్జన, మలవిసర్జన సమయంలో బయటకు వస్తాయి. మీ నీళ్లు సరిగ్గా తాగకపోయినా మూత్రం ముదురు రంగులో ఉంటుంది. ఒకవేళ మీరు సరిపడా నీళ్లు తాగినా.. మీ మూత్రం ముదుర రంగులో ఉంటే లివర్‌ సమస్యలో ఉన్నట్లు అనుమానించాల్సిందే.

చేతులు, కాళ్ల వాపు..

కాలేయ సమస్యలు ఉంటే హఠాత్తుగా చేతులు, కాళ్లు వాపు వస్తాయి. లివర్‌ సరిగ్గా పనిచేయకపోయినా, శరీరంలో టాక్సిన్స్‌ పేరుకుపోయినా ఇలాంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

తీసుకోవాల్సిన ఆహారం…

లివర్‌ ఆరోగ్యంగా ఉండాలంటే.. సరైన జీవనశైలిని పాటించాలి.  ఆహారంలో ఆకు కూరలు, పండ్లు, నానబెట్టిన బాదం, ఎర్ర బియ్యం తీసుకోవాలని సూచించారు. ప్రాసెస్ చేసిన ఆహారం, ప్యాకేజ్‌ ఆహారం, స్వీట్స్‌కు వీలైనంత దూరంగా ఉండాలి. ప్రతి రోజు వ్యాయామం చేయడం..సరైన పరిమాణంలో పోషక ఆహారం తీసుకోవడం … ఆల్కహాల్​..ఫాస్ట్​ఫుడ్​కు దూరంగా ఉంటే.. లివర్​ సురక్షితంగా.. ఆరోగ్యంగా ఉంటుందని వెల్లడించారు కర్నూలు కిమ్స్​ హాస్పిటల్ గ్యాస్ర్టో ఎంట్రాలజిస్ట్​ అండ్​ హెపటాలజిస్ట్​డా.కె. నవీన్​ కుమార్​.

About Author