ఉల్లిగడ్డల లోడ్ .. గుట్కా రవాణా
1 min read–40 బస్తాల గుట్కాప్యాకెట్లు స్వాధీనం
– వాహనం సీజ్.. ఇద్దరి అరెస్ట్
పల్లెవెలుగు వెబ్, పాణ్యం : కర్నూలు జిల్లా పాణ్యం డొంగు సమీపంలో శుక్రవారం పోలీసు సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఓ ఉల్లిగడ్డల లోడుతో వెళ్తున్న లారీలో 40 బస్తాల గుట్కాప్యాకెట్లు పట్టుకుని, ఇద్దరిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ చిదానంద రెడ్డి తెలిపారు. రాయచూర్ నుంచి కంభంకు ఉల్లిగడ్డల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం ( Ap31Th5187) డొంగు రస్తాలో తనిఖీ చేయగా ఉల్లిగడ్డల సంచుల మధ్యలో 21 వేల గుట్కా ప్యాకెట్లు గుర్తించారు. వాటి విలువ రూ. దాదాపు 3లక్షల15వేలు ఉంటుందన్నారు. వాహనాన్ని సీజ్ చేసి, ఇద్దరిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. ముద్దాయిలు మేడం శ్రీనివాస్ (గుంటూరు జిల్లా వినుకొండ), షేక్ నాయర్ ( ప్రకాశం జిల్లా కంభం)ను విచారించగా వెంకటరామాంజనేయులు, రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తులు చెబితే నిషేధిత పదార్థాలను తరలించినట్లు తెలిపారు. సమావేశంలో సీఐ జీవన్ గంగనాథ్ బాబు, ఎస్ఐ సుధాకర్ రెడ్డి, సిబ్బంది ఉన్నారు.