భూ సమస్యలకు సత్వర పరిష్కారం..జిల్లా జాయింట్ కలెక్టర్
1 min read
ఆదోని, న్యూస్ నేడు: జిల్లాలో రీ సర్వే గ్రామ సభ, రెవెన్యూ సదస్సులలో నమోదైన భూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చేయడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ బి. నవ్య తెలిపారు. బుధవారం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ , జిల్లా కార్యాలయం అధికారులు, ఎమ్మిగనూరు మరియు ఆదోని తహశీల్దార్లతో కలిసి రీ సర్వే జరిగిన గ్రామాలలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ… రీ సర్వే జరిగిన గ్రామాలలో అధికంగా వచ్చిన ఫిర్యాదులకు గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగిందని, ముఖ్యంగా రైతుల పట్టా భూములు ఇనాం భూములుగా నమోదవడం వల్ల ఎదురైన సమస్యలను క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేసి పరిశీలించి పరిష్కరించడం జరిగిందన్నారు. ఎమ్మిగనూరు మండలం కడివెల్ల, కిందనతి, ఆదోని మండలంలో కుప్పగల్, దనపురం, నారాయణపురం గ్రామాలలో 303 మంది రైతుల భూ సమస్యలను పరిష్కరించడం జరిగినదని, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదోని తహశీల్దార్ శివరాముడు, ఎమ్మిగనూరు తహశీల్దార్ శేష ఫణి, జిల్లా కార్యాలయం అధికారులు వేణు గోపాల్ శర్మ, వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.