వైభవం.. సూర్య భగవానుడి రథోత్సవం..
1 min readస్వామికి ప్రత్యేక పూజలు చేసిన శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ
- స్వామి వారిని దర్శించుకున్న ప్రముఖులు
- రథోత్సవానికి భారీగా తరలివచ్చిన భక్తులు
కర్నూలు, పల్లెవెలుగు: రాయలసీమ ముఖ ద్వారమైన కర్నూలు నగరంలో వెలిసిన శ్రీశ్రీశ్రీ సూర్య నారాయణ స్వామి దేవాలయ ఆవరణంలో శుక్రవారం రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. రథ సప్తమి వేడుకల్లో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద స్వామిజీ సూర్య దేవుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి, సభ్యుల నేతృత్వంలో మధ్యాహ్నం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
వైభవం…రథోత్సవం…
నగరంలోని సూర్య దేవాలయంలో శ్రీశ్రీశ్రీ సచ్చినంద స్వామిజీ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సూర్య దేవుడి మూల విరాట్‌ను రథంలో ఊరేగించారు. భక్తుల కోలాటాలు, భజనల మధ్య స్వామి వారి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కార్యక్రమంలో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని.. మొక్కు సమర్పించుకున్నారు. అంతకు ముందు శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చినంద స్వామిజీ చేతుల మీదుగా స్వామి వారికి నైవేద్యం తయారు చేశారు. ఆ తరువాత భక్తులకు సందేశమిచ్చారు.. కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ విజయ మనోహరితోపాటు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.