రహదారిలో ఇరుక్కుపోయిన లారీ..!
1 min readపల్లెవెలుగు వెబ్, చెన్నూరు:మండల కేంద్రమైన చెన్నూరు కొత్త రోడ్ నుంచి పాత బస్టాండ్ వెళ్లే ప్రధాన రహదారి విస్తరించగా పోవడంతో ఈ రహదారి గుండా వెళ్లే బారి వాహనాలు ఇరుకైన రహదారిలో ఇరుక్కుపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆదివారం ఒక సిమెంట్ లారీ చెన్నూర్ లో ఉన్న పాత స్టేట్ బ్యాంకు వద్ద రహదారి గుండా పోలేక ఒక ఇంటి గోడలు ఆనుకొని పోవడంతో గోడలు దెబ్బతిన్నాయి. దీంతో ఇంటి యజమాని లారీ డ్రైవర్ తో వాగ్వాదానికి దిగారు. దీంతో గంటల తరబడి ఆ దారిన ట్రాఫిక్ ఆగిపోయింది. గ్రామపంచాయతీ అధికారులు రెవెన్యూ అధికారులు రహదారిని విస్తరించేందుకు మార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు రోడ్డు విస్తరణ జరగలేదు. రహదారి విస్తరణలో చెన్నూరు కు చెందిన ప్రజా ప్రతినిధులు కూడా సహకరించడం లేదన్నా ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ కారణాల వల్లే రోడ్డు విస్తరణ పనులు ఆగిపోయాయి అన్న ఆరోపణలు వస్తున్నాయి. సంబంధిత అధికారులు కూడా తమకు ఏమీ పట్టనట్లు చోద్యం చూస్తున్నారు. వందల సంఖ్యలో వాహనాలు తిరిగే ఈ రహదారి విస్తరించ కపోతే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని కోరుతున్నారు.