మాధవస్వామి అక్రమ సస్పెన్షన్ ను ఎత్తివేయాలి: ఏపీటీఎఫ్
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల : ఏపీటీఎఫ్ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు ఫ్యాప్టో జిల్లా చైర్మన్ అయిన బి . మాధవ స్వామి అక్రమ సస్పెన్షన్ ను తక్షణమే ఎత్తివేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నగిరి. శ్రీనివాసులు జిల్లా ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. శనివారం గడివేములలో జరిగిన ఏపీటీఎఫ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బనగానపల్లెలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఈనెల ఏడో తేదీన పదవ తరగతి ఇంగ్లీష్ మీడియం తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులను మరియు క్లాస్ టీచర్, భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడైన బి. మాధవస్వామిని తీవ్రమైన అసభ్య పదజాలంతో దూషించారని , ఆమెపై సమగ్ర విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని ఏపీటీఎఫ్ నంద్యాల జిల్లా శాఖ పక్షాన ఈనెల 9 వ తేదీన జిల్లా విద్యాశాఖ అధికారికి ప్రాతినిధ్యము చేయడం జరిగిందని ఆయన అన్నారు. అయితే ప్రధానోపాధ్యాయురాలి పైన గాని మరియు సంఘటనకు సంబంధం ఉన్న పదవ తరగతి ఇంగ్లీష్ మీడియం విద్యార్థులతో గాని విచారణ చేయకుండా సంఘటనకు సంబంధం లేని 6, 7 ,8 ,9 తరగతులలో ఎంపిక చేయబడ్డ విద్యార్థులతో ప్రశ్నావళిని ఇచ్చి వ్రాయించుకోవడం జరిగిందని ఆయన అన్నారు. ప్రధానోపాధ్యాయురాలు పై చర్యలు తీసుకోకుండా, అంకితభావంతో పనిచేసే మాధవస్వామి ని సస్పెండ్ చేస్తూ ఉమ్మడి జిల్లా డీఈఓ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయడం పలు అనుమానాలకు దారితీస్తుందని ఆయన ఆరోపించారు. కాబట్టి జిల్లా ఉన్నతాధికారులు ఇప్పటికైనా నిష్పక్షపాతంతో వ్యవహరించే అధికారులతో సంఘటనకు సంబంధం ఉన్న విద్యార్థులతో సమగ్రమైన విచారణ చేపట్టి తప్పు చేసిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏపీటీఎఫ్ పక్షాన ఫ్యాప్టో , ఏపీ జెఎసి తో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర కౌన్సిలర్లు ఎస్. మహబూబ్ బాషా, ఏ. నాగన్న, జిల్లా కార్యదర్శి ఆవుల మునిస్వామి, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్. బాలస్వామి, మానపాటి రవి , కె. రాముడు ,చంద్రశేఖర్ ఆచారి, మల్లికార్జునయ్య, నాగయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.