PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అహింసా పద్ధతిలో దేశానికి స్వాతంత్రం సాధించిన మహాత్మా గాంధీ

1 min read

అహింసా విధానంలో దేశానికి స్వాతంత్రం సాధించవచ్చు అని నిరూపించిన ఘనత మహాత్మా గాంధీజీదే

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా దళితవాడలో మహిళలకు చీరలు పంపిణీ చేసిన సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: అహింసా పద్ధతిలో దేశానికి స్వాతంత్రం సాధించుకోవచ్చని నిరూపించిన ఘనత జాతిపిత మహాత్మా గాంధీజీ కే దక్కుతుందని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. కర్నూల్ నగరంలోని బుధవారం పేటలో ఉన్న దళితవాడలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ప్రపంచంలోని చాలా దేశాల్లో హింసాత్మక పద్ధతుల్లో దేశానికి స్వాతంత్రం సాధించుకున్న సందర్భాలు ఉన్నాయని చెప్పారు .కానీ అందుకు భిన్నంగా జాతిపిత మహాత్మా గాంధీ శాంతియుత పద్ధతుల్లో మన దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచారని చెప్పారు. ప్రపంచంలో అన్నిటికంటే మించినది స్వేచ్ఛాయుత వాతావరణం లో జీవించడం అని, అది మన దేశంలో మహాత్మా గాంధీ వల్లే సాధ్యపడిందని కొనియాడారు. నిజం పలకడం, అహింసా విధానం అవలంబించడం వంటివి నిజమైన ఆయుధాలని గాంధీ నిరూపించారని చెప్పారు. స్వాతంత్ర సంగ్రామంలో మహాత్మా గాంధీ వినియోగించిన సత్యాగ్రహం అనే  ఆయుధం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని వివరించారు. దక్షిణాఫ్రికాలో తెల్ల, నల్లజాతీయుల మధ్య జరుగుతున్న వివక్షతను రూపుమాపడంలో మహాత్మా గాంధీ ఎంతో కృషి చేశారని చెప్పారు. దక్షిణాఫ్రికా స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ పాత్ర ఎంతో కీలకంగా మారిందని చెప్పారు మన దేశ స్వాతంత్ర పోరాటంలో కూడా మహాత్మా గాంధీ ఎంచుకున్న అహింసా విధానం అందరికీ ఆదర్శప్రాయం అన్నారు. స్వాతంత్రాన్ని తీసుకురావడంతో పాటు దేశంలో వివక్షతను, అంటరానితరాన్ని రూపుమాపడంలో మహాత్మా గాంధీ ఎంతో కృషి చేశారని వివరించారు. జాతిపిత మహాత్మా గాంధీ జీవితం నేటి తరం యువతకు ఆదర్శప్రాయమని వివరించారు. ముఖ్యంగా నిజం పలకడం ,అహింసా విధానాన్ని అవలంబించడం వంటి విధానాలను విద్యార్థులకు చిన్నతనం నుంచి అలవాటు చేయాలని చెప్పారు. ఇందుకోసం మహాత్మా గాంధీ జీవిత చరిత్రను ప్రతి విద్యార్థి తెలుసుకొనేలా కృషి చేయాలన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ అందించిన స్ఫూర్తితోనే ఆయన వర్ధంతి సందర్భంగా నగరంలోని దళితవాడలో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ వెల్లడించారు. మహాత్మా గాంధీ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చూపిన మార్గాలు మన హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయాయని చెప్పారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు.

About Author