ఓటర్ల జాబితాలోని సవరణలకు పక్కా రికార్డులు నిర్వహించండి
1 min readపారదర్శకతతో ఓటర్ల జాబితా సిద్ధం చేయండి
ఎలక్టోరల్ అబ్జర్వర్ మురళీధర్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: ఓటర్ల జాబితాలో చేర్పులు మార్పులకు సంబంధించి పక్కా రికార్డులు నిర్వహించాలని ఎలక్టోరల్ అబ్జర్వర్, ఏపియంఎస్ఐడిసి మేనేజింగ్ డైరెక్టర్ మురళీధర్ రెడ్డి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఈఆర్ఓ, ఎఈఆర్ఓ లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ తో కలిసి ఓటర్ల జాబితా సవరణపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఈఆర్ఓ, ఎఈఆర్ఓ లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎలక్టోరల్ అబ్జర్వర్, ఏపియంఎస్ఐడిసి మేనేజింగ్ డైరెక్టర్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో చేర్పులు మార్పుల సవరణలకు సంబంధించి ఎలాంటి చిన్న పొరపాట్లకు తావివ్వకుండా పక్కా రికార్డులు నిర్వహించాలని ఈఆర్ఓ, ఎఈఆర్ఓ లను ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలను తు.చ తప్పక వంద శాతం పాటిస్తూ ప్రొసీజర్ ప్రకారం తప్పులు లేని ఓటర్ల జాబితా రూపొందించాలన్నారు. ఓటర్ల జాబితాలో కరెక్టే ఉన్నప్పటికీ ప్రొసీజర్ ఫాలో కాకపోవడం వల్ల ఇటీవలే ఇద్దరు అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. రోల్ అబ్జర్వర్ గా తాను రాజకీయ పార్టీల ప్రతినిధులతోనూ, ఈఆర్ఓ, ఎఈఆర్ఓ లతో మొదటి సమావేశం నిర్వహిస్తున్నానని వచ్చే సమావేశాలలో క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితా పరిశీలిస్తానన్నారు. వచ్చిన క్లెయిమ్స్ అన్నింటిని పెండింగ్ లో పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు ప్రొసీజర్ ప్రకారం క్లియర్ చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా సహకరించాలని కోరారు. ఓటర్ల జాబితాలో నమోదుకు సంబంధించి 100, తొలగింపులకు సంబంధించి 100, చేర్పులు మార్పులకు సంబంధించి 50 క్లెయిమ్స్ ను ర్యాండముగా తనిఖీ చేస్తానన్నారు. ప్రొసీజర్ ఫాలో కాకుండ పక్కా డాక్యుమెంటేషన్ లేకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవన్నారు. ఎలాంటి చిన్న తప్పులు జరిగినా ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంటుందని… ఈ మేరకు సంబంధిత ఈఆర్ఓ, ఎఈఆర్ఓలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పారదర్శకమైన తప్పులు లేని ఓటర్ల జాబితాను తయారు చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో తొలగింపులు, నమోదుపై సాధారణ రీతిలో నోటి మాటగా కాకుండా నిర్దిష్టమైన ఆధారాలతో రాతపూర్వకంగా ఫిర్యాదులు అందిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే తప్పుడు సమాచారం, ఫిర్యాదులు అందిస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 సెక్షన్ 31 ప్రకారం సంబంధిత వ్యక్తులపై కూడా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరించారు. డెత్ ఓటర్స్ ఉంటే…. సంబంధిత వ్యక్తుల సమాచారం ఇస్తే పంచనామా నిర్వహించి డెత్ ఓటర్స్ ను ఓటర్ల జాబితా నుండి తొలగిస్తామన్నారు.అంతకుముందు జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి జిల్లా జనాభా, ఓటర్ల వివరాలు, పోలింగ్ స్టేషన్లు, ఈపీ రేషియో, జెండర్ రేషియో 18-19 సంవత్సరాల యువ ఓటర్లు, పిడబ్ల్యుడి ఓటర్స్ తదితర వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎలక్ట్రోరల్ అబ్జర్వర్ కు వివరించారు.వైయస్సార్ సిపి పార్టీ తరఫున అమృతరాజ్, తెలుగుదేశం పార్టీ తరఫున శివరామిరెడ్డి, సిపిఎం పార్టీ తరపున నరసింహ, కాంగ్రెస్ పార్టీ తరఫున సయ్యద్ రియాజ్ తదితరులు మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో డెత్ ఓటర్లు, డూప్లికేట్ ఓటర్ల తొలగింపులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాంటి వివరాలు ఉంటే ఆధారాలతో నివేదిక ఇవ్వాలని అబ్జర్వర్ పార్టీ ప్రతినిధులను సూచించారు.