గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పటిష్టంగా నిర్వహించండి
1 min read– జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జనవరి 26 న నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పటిష్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో స్పందన కార్యక్రమం లో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన సమన్వయ సమీక్షా సమావేశం నిర్వహించారు.జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన మాట్లాడుతూగణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు చేయాలని అధికారులందరూ సమన్వయంతో వ్యవహరించి పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఆయా శాఖల పరిధిలో చేయాల్సిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రతి ఒక్కరూ తమకు అప్పగించిన బాధ్యతలను విధిగా నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు. వేడుకలు నిర్వహించే మైదానాన్ని సిద్దం చేయాలని, పరిశుభ్రతా చర్యలు చేపట్టాలని, ప్రోటోకాల్ బాధ్యతలు, సీటింగ్ ఏర్పాట్లు చూసుకోవాలన్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు గత ఏడాది మాదిరిగానే నిర్వహించాలని, ఈ ఏడాది మరిన్ని విభిన్నమైన తెలుగు పాటలను ఎంపిక చేయాలని నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూసుకోవాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి తెలియజేస్తూ స్టాళ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ ఏడాదిలో జిల్లా సాధించిన ప్రగతి విశేషాలను తెలియపరుస్తూ శకటాలను ప్రదర్శించాలని, అందరూ సమన్వయం వహించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మెరుగైన సేవలు అందించిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేయడం జరుగుతుందని అందుకుగాను ఆయా కార్యాలయాల హెచ్ఓడి లు ఎంపిక చేయబడిన వారి వివరాలను త్వరగా డిఆర్ఓకి పంపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.సమావేశంలో జాయింట్ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య,డీఆర్వో కె. మధుసూదన్ రావు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.